తెలంగాణ

telangana

ETV Bharat / sports

గుజరాత్​ బౌలర్లు భళా.. ఉత్కంఠ పోరులో కేకేఆర్​పై​ విజయం

IPL 2022 GT Vs KKR: ఐపీఎల్​ 2022లో భాగంగా కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ టైటాన్స్​.. 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో మళ్లీ టాప్​లోకి దూసుకెళ్లింది.

IPL 2022 GT Vs KKR
IPL 2022 GT Vs KKR

By

Published : Apr 23, 2022, 7:40 PM IST

Updated : Apr 23, 2022, 8:22 PM IST

IPL 2022 GT Vs KKR: ఐపీఎల్​ 15వ సీజన్​లో గుజరాత్​ టైటాన్స్​ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో 8 పరుగుల తేడాతో గెలుపొందింది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్​ను వెనక్కి నెట్టి మళ్లీ టాప్​కు చేరింది గుజరాత్​. 157 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్​కతా జట్టును పాండ్య సేన 148 పరుగులకే కట్టడి చేసింది. గుజరాత్​ బ్యాటర్లలో కెప్టెన్​ హార్దిక్​ పాండ్య(67) టాప్​ స్కోరర్​గా నిలిచాడు.

ఆఖరి ఓవర్‌ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్​ చివరి ఓవర్‌లో 18 పరుగులు సాధించాల్సి ఉండగా.. అల్జారీ జోసెఫ్‌ బౌలింగ్‌లో తొలి బంతికే ఆండ్రీ రస్సెల్ (48) సిక్స్‌ కొట్టి ఆశలు రేపాడు. అయితే రెండో బంతికే ఫెర్గూసన్ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. మిగతా నాలుగు బంతుల్లో కేవలం మూడు పరుగులే రావడంతో విజయం గుజరాత్‌ వశమైంది. ఈ విజయంతో మరోసారి గుజరాత్ (12) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 156/9 స్కోరు సాధించగా.. కోల్‌కతా 148/8 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్ 2, షమీ 2, యశ్‌ దయాల్ 2.. అల్జారీ జోసెఫ్‌, లాకీ ఫెర్గూసన్‌ చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన గుజరాత్​ టైటాన్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆకట్టుకోలేకపోయినప్పటికీ హార్దిక్​ పాండ్యా మరోమారు కెప్టెన్​ ఇన్సింగ్స్​ ఆడి జట్టును ముందుకు నడిపించాడు. పాండ్యాకు మిల్లర్​ తోడవటం వల్ల భారీ స్కోర్​ సాధిస్తుందని భావించారు. అయితే.. చివరి ఓవర్లో 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి భారీ స్కోర్​కు అడ్డుకట్ట వేశాడు కోల్​కతా బౌలర్​ ఆండ్రీ రసెల్​.హార్దిక్​ పాండ్యా 49 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 67 పరుగులు చేసి సౌథీ బౌలింగ్​లో వెనుదిరిగాడు. డేవిడ్​ మిల్లర్​ 20 బంతుల్లో 27, వృద్ధిమాన్​ సాహా 25 బంతుల్లో 25 పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు రెండంకెల స్కోర్​ సాధించలేకపోయారు. కోల్​కతా బౌలర్లలో టీమ్ సౌథీ 3, రసెల్​ 4 వికెట్లు పడగొట్టారు.

  • ఈ మ్యాచ్​లో గుజరాత్​ బౌలర్​ రషీద్​ ఖాన్​.. తన ఐపీఎల్​ కెరీర్​లో​ వంద వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. 83 మ్యాచుల్లో 101 వికెట్లు తీశాడు రషీద్​. ఇది వరకు బౌలర్లు లసిత్​ మలింగ 70 మ్యాచుల్లో, భువనేశ్వర్​ కుమార్​ 82 మ్యాచుల్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నారు.
  • ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఒక ఓవర్ లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టిన తొలి బౌల‌ర్‌గా రసెల్ రికార్డు సృష్టించాడు.
    లక్ష్మీ రతన్​ శుక్లా 3/6 (0.5) KKR vs DC కోల్​కతా 2008
    శ్రేయస్​ గోపాల్​ 3/12 (1) RR vs RCB బెంగళూరు 2019
  • ఈ మ్యాచ్​లో కోల్​కతా ఆల్​రౌండర్​ ఆండ్రీ రసెల్​.. నలభై కన్నా ఎక్కువ పరుగులు చేసి, నాలుగు వికెట్లు తీసినా లాభం లేకుండా పోయింది. చివరి క్షణంలో కేకేఆర్​ జట్టు ఓటమిపాలైంది. ​లీగ్​ చరిత్రలో ఓ మ్యాచ్​లో నలభై కన్నా ఎక్కువ పరుగులు చేసి, నాలుగు వికెట్లు పడగొట్టి ఓటమిపాలైన జట్లలో ఉన్న ఆటగాళ్ల వివరాలు చూద్దాం.
    యువరాజ్​ సింగ్ 66 & 4/29 పుణె వారియర్స్​ Vs డెక్కన్​ చార్జర్స్​ 2011
    యువరాజ్​ సింగ్ 83 & 4/35 బెంగళూరు vs రాజస్థాన్​ రాయల్స్​ 2014
    డేవిడ్​ వీస్​​ 47 & 4/33 బెంగళూరు vs ముంబయి 2015
  • ప్రస్తుత సీజన్​లో గుజరాత్​ టైటాన్స్​ జట్టు చివరి ఓవర్​ వరకు వెళ్లి విజయం సాధించిన మ్యాచుల్లో ఇది నాలుగోది. ఇది వరకు, పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో చివరి బంతికి గెలిచింది పాండ్య సేన. అలాగే చెన్నైతో తలపడిన మ్యాచ్​లో మరో బంతి మిగిలుండగా, లఖ్​నవూతో జరిగిన మ్యాచ్​లో రెండు బంతులు ఉండగా విజయం సాధించింది.
  • శనివారం జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ జట్టు.. మొదటి 15 ఓవర్లలో రెండు లేదా అంతకంటే తక్కువ వికెట్లు కోల్పోయి, చివరి ఐదు ఓవర్లలో మరో 7 వికెట్లు కోల్పోయి 29 కంటే తక్కువ పరుగులు చేసింది. ఇలాంటి సందర్భం లీగ్​ చరిత్రలో ఒకసారి మాత్రమే జరిగింది. 2009 డర్భన్​లో ముంబయితో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ 15 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి.. చివరి ఐదు ఓవర్లలో 29 కంటే తక్కువ పరుగులు సాధించింది. మరో ఐదు వికెట్లు కోల్పోయింది.

ఇదీ చదవండి:రెజ్లర్​ రవి దహియాకు గోల్డ్​.. పునియాకు సిల్వర్​

Last Updated : Apr 23, 2022, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details