IPL 2022 Ayush Badoni: లఖ్‌నవూ జట్టు యువ ఆటగాడు ఆయుష్ బదోని మెగా టీ20 లీగ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సోమవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన అతడు.. తొలి గేమ్‌లోనే అంచనాలకు మించి రాణించాడు. 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును అర్ధ శతకంతో ఆదుకున్నాడు. యువ ఆటగాడిగా టీ20ల్లో ఏమాత్రం అనుభవం లేకపోయినా.. కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్ చేశాడు. రషీద్‌ఖాన్, లాకీ ఫెర్గూసన్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లపై సిక్సులు బాదాడు. దీంతో ఈ టీ20 టోర్నీ చరిత్రలో తొలి మ్యాచ్‌లోనే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధ శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
కాగా, ఆయుష్ ఈ మ్యాచ్‌కు ముందు టీ20 క్రికెట్‌లో కేవలం 8 పరుగులే చేశాడు. అంతకుముందు పొట్టి ఫార్మాట్‌లో అతడికి ఏమాత్రం అనుభవం లేదు. కనీసం ఫస్ట్‌క్లాస్ లేదా లిస్ట్-ఏ క్రికెట్ ఆడిన అనుభవం కూడా లేకపోయింది. ఈ నేపథ్యంలోనే 41 బంతుల్లో.. 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేశాడు. దీపక్ హుడా (55; 41 బంతుల్లో 6x4, 2x6)తో కలిసి ఐదో వికెట్‌కు 87 పరుగులు జోడించాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో రెండు బంతులు మిగిలుండగా ఔటయ్యాడు. ఈ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టు యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు.