క్రికెట్లో రాణించలేకపోయి ఉంటే రోడ్లపై పానీపూరీ అమ్ముకునేవాడినని అంటున్నాడు కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ షెల్డన్ జాక్సన్(sheldon jackson ipl 2021). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇతడు తన కెరీర్లో ఎదుర్కొన్న ఎత్తుపల్లాల గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఒకానొక దశలో క్రికెట్‌ను పూర్తిగా వదులుకోవాలని తాను భావించినట్లు చెప్పాడు.
"నా 25ఏళ్ల వయసులో క్రికెట్‌ను పూర్తిగా వదిలేయాలని అనుకున్నా. రంజీ ట్రోఫీలో ఐదేళ్ల పాటు ఒక్క సింగిల్ మ్యాచ్ కూడా ఆడలేదు. అప్పుడు షపత్ షా అనే నా స్నేహితుడు.. 'ఇన్నేళ్లు బాగా కష్టపడ్డావు. ఇంకొక ఏడాది అవకాశం కోసం ఎదురుచూడు. అప్పటికీ ఇలానే ఉంటే తిరిగి వచ్చేయ్. నేను జాబ్ ఇస్తా. నా ఫ్యాక్టరీలో పని చేయ్. కానీ ఇంకొక ఏడాది మాత్రం ఎదురుచూడు' అని నన్ను ప్రోత్సహించాడు. ఆ ఏడాది రికార్డులు తిరగరాశా. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచా. ఒకే ఏడాది నాలుగు సెంచరీలు బాదాను. అందులో మూడు వరుస శతకాలు ఉన్నాయి. అప్పటి నుంచి నా కెరీర్ పరుగులు తీసింది. అప్పుడే నిశ్చయించుకున్నా. నా జీవితంలో ఏదైనా చేయాలని. ఇంకా క్రికెట్‌పై తప్ప దేనిపై దృష్టి సారించలేదు. ఒకవేళ క్రికెట్ సెట్ అవ్వకపోయి ఉంటే రోడ్లపై పానీపూరీ అమ్ముకునేవాడిని."
-షెల్డన్ జాక్సన్, కేకేఆర్ బ్యాట్స్‌మన్.