ముంబయి ఇండియన్స్ (Mumbai Indians Squad 2021) తుది జట్టులో స్థానం కోల్పోయిన సమయంలో విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్‌తో జరిపిన సంభాషణలు తనలో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని నింపాయని ఇషాన్ కిషన్ (Ishan Kishan) అన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు యాజమాన్యం తనపై నమ్మకం ఉంచిందని వివరించాడు. మంగళవారం (IPL 2021) రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ( 50 నాటౌట్; 25 బంతుల్లో 5×4, 3×6) అదరగొట్టి ముంబయి విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కిషన్ మాట్లాడాడు.
"తిరిగి ఓపెనింగ్ చేయడం, జట్టు కోసం పరుగులు చేయడం, భారీ తేడాతో విజయం సాధించడానికి సహాయపడటం ఆనందంగా ఉంది. నిజంగా ఇది మంచి అనుభూతి. మా జట్టు పుంజుకోవడానికి ఇది అవసరం. ఒడిదొడుకులు అనేవి ఏ క్రీడాకారుని జీవితంలోనైనా ఓ భాగం అని భావిస్తా. ప్రస్తుతం నేను కూడా గొప్ప స్థితిలో లేను. గత సీజన్లలో మాదిరిగా చాలా మంది బ్యాటర్లు పరుగులు చేయలేకపోతున్నారు. మాకు మంచి సహాయక సిబ్బంది, కెప్టెన్ ఉన్నారు" అని ఇషాన్ కిషన్ అన్నాడు.