చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రెండో దశలో ఇప్పటికే రెండు విజయాలు సాధించి జోరుమీదున్న సీఎస్కే.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ జయకేతనం ఎగరేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(40;28బంతుల్లో 2×4, 3×6), డుప్లెసిస్ (43; 30 బంతుల్లో 7×4) రాణించగా.. కోల్‌కతా నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
అదరగొట్టిన ఓపెనర్లు..
చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన మూడో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన డుప్లెసిస్.. తర్వాత వరుణ్ చక్రవర్తి వేసిన ఓవర్లోనూ ఇదే సీన్ రిపీట్ చేశాడు. సునీల్ నరైన్ వేసిన ఐదో ఓవర్‌లో గైక్వాడ్ ఓ సిక్స్, ఫోర్ బాదాడు. దూకుడుగా ఆడుతున్న రుతురాజ్‌ను రసెల్ 9వ ఓవర్లో వెనక్కి పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ(35; 28బంతుల్లో 2×4, 2×6) ఫర్వాలేదనిపించాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 11.3 ఓవర్‌కు డుప్లెసిస్ ఔటయ్యాడు. అంబటి రాయుడు(10)ను సునీల్ నరైన్ పెవిలియన్ చేర్చాడు. ఫెర్గూసన్ వేసిన 17వ ఓవర్‌లో మొయిన్ అలీ వెంకటేశ్ అయ్యర్‌కి చిక్కాడు. రైనా(11), ధోనీ(1) ఔటవడం వల్ల చివర్లో ఉత్కంఠ నెలకొంది. జడేజా (22; 8బంతుల్లో 2×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడి చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. కోల్‌కతా బౌలర్లలో రసెల్, ఫెర్గూసన్, ప్రసిద్ధ్ కృష్ణ, చక్రవర్తి, నరైన్ తలో వికెట్ తీశారు.