తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఏంటీ రాహుల్​ భయ్యా.. రూ.17 కోట్లు తీసుకుని ఇలాగేనా ఆడేది' - కేఎల్‌ రాహుల్‌ ట్రోల్స్​

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో లఖ్​నవూ సూపర్​ జేయింట్స్​ విజయాన్ని సాధించింది. అయితే ఉత్కంఠంగా మ్యాచ్​ జరుగుతున్న సమయంలో లఖ్​నవూ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ పేలవ ప్రదర్శనను చూసిన అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అతడిని ట్రోల్స్​ చేస్తున్నారు. అయితే దీనిపై రాహుల్ కూడా స్పందించాడు. ఏమన్నాడంటే..

kl rahul
kl rahul

By

Published : Apr 11, 2023, 12:54 PM IST

ఐపీఎల్‌-2023లో భాగంగా సోమవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌, కేఎల్‌ రాహుల్‌ తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. ఈ మెగా ఈవెంట్‌ మ్యాచ్​లో రాహుల్‌ తన ఆటతీరుతో అభిమానులకు చిరాకు తెప్పించాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన సమయంలో రాహుల్‌.. టెస్టు మ్యాచ్‌ను తలపించేలా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. 213 టార్గెట్​తో బరిలోకి దిగిన లఖ్​నవూ జట్టులో 20 బంతులు ఎదుర్కొన్న రాహుల్‌.. కేవలం 18 పరుగుల స్కోర్​ చేసి పెవిలియన్‌ బాట పట్టాడు. అతడు ఆడిన 18 బంతుల్లో కేవలం ఒకే ఒక బౌండరీ ఉంది. మరోవైపు ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచుల్లోనూ కేవలం 61 పరుగులను మాత్రమే స్కోర్​ చేశాడు. ఇక సన్​రైజర్స్​పై అతడు చేసిన 35 పరుగుల స్కోర్​ ఇప్పటి వరకు ఆడిన వాటిల్లో అత్యధిక స్కోర్‌గా ఉంది. ఆ స్కోర్​ కూడా అతడు 31 బంతుల్లో చేశాడు. అయితే తాజాగా ఆర్సీబీపై చెత్త ఇన్నింగ్స్‌ ఆడిన కేఎల్‌ రాహుల్​ను సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు దారుణంగా ట్రోల్​ చేస్తున్నారు." ఏంటి రాహుల్‌ ఇదేమైనా.. టెస్ట్​ మ్యాచ్​లు అనుకుంటున్నావా" అంటూ పోస్ట్​ చేస్తున్నారు. ఇంకొంతమందేమో.. "రూ.17 కోట్లు తీసుకున్నావు.. టెస్టు క్రికెట్‌ కన్నా దారుణంగా ఆడుతున్నావేంటీ" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అందుకే అలా ఆడాను..అయితే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో తన బ్యాటింగ్ విధానాన్ని లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్‌ రాహుల్ సమర్థించుకున్నాడు. అతనెందుకు నిదానంగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు. వెనువెంటనే వికెట్లు పడిపోవడంతో జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందని, పరిస్థితిని బట్టి ఆడానని రాహుల్​ చెప్పుకొచ్చాడు.

మ్యాచ్‌ తర్వాత మీడియాతో మాట్లాడిన రాహుల్​.. "బంతి మొదట్లో స్వింగ్‌ అవ్వడం వల్ల మేము 3 వికెట్లు కోల్పోయాం. ఆ పరిస్థితిని నేను గమనించాను. అయితే చివరి వరకూ ఉండి నికోలస్‌కు సహకరించాలనే నేను నిదానంగా ఆడాను. ఎక్కువ పరుగులు చేయాలనుకున్నాను. ఓ సారి క్రీజ్‌లో కుదురుకుంటే కచ్చితంగా మంచి ఇన్నింగ్స్‌ ఆడేవాణ్ని. నా స్ట్రెక్‌ రేట్‌ కూడా ఇంకాస్త మెరుగయ్యేది. నేను చివరి వరకు ఉండి ఉంటే కచ్చితంగా మ్యాచ్‌ ఇంకా సులభంగా గెలిచేవాళ్లం" అంటూ కేఎల్‌ రాహుల్​ పేర్కొన్నాడు.

మరోవైపు లఖ్‌నవూ విజయంలో కీలకపాత్ర పోషించిన నికోలస్‌ పూరన్‌, స్టొయినిస్‌లను ప్రశంసించాడు రాహుల్‌. "టీ20ల్లో 5,6,7 బ్యాటింగ్‌ స్థానాలు చాలా ముఖ్యమైనవి. ఆ స్థానాల వల్ల మ్యాచులు గెలిచే అవకాశం ఉంటుంది. చిన్నస్వామి స్టేడియం నిజంగా ఓ అద్భుతం. ఈ మ్యాచ్‌లో మేము మంచి విజయాన్ని సాధించాం. 213 పరుగులను చేధిస్తున్నప్పుడు చాలా కష్టపడాలి. వికెట్లు కోల్పోయినప్పుడు ఆటగాళ్లలో ఒత్తిడి పెరుగుతుంది. కానీ, స్టొయినిస్‌, పూరన్‌ గొప్పగా రాణించారు. మేము ఇప్పుడు మ్యాచ్‌ గెలిచి రెండు పాయింట్లు సాధించామంటే దానికి కారణం వారిద్దరి బ్యాటింగే. బదోని కూడా ఈ సీజన్​లో గొప్పగా రాణిస్తున్నాడు" అని అన్నాడు.

కాగా, ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ చివరి బంతికి విజయం సాధించింది. మార్కస్‌ స్టొయినిస్‌(65), నికోలస్‌ పూరన్‌(62) అర్ధ శతకాలు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో లఖ్‌నవూ పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది. 4 మ్యాచుల్లో మూడు విజయాలు సాధించి మొదటి స్థానంలో కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details