ఈ ఐపీఎల్ సీజన్లో(IPL 2021) అత్యంత నిలకడగా ఆడి, లీగ్ దశలో అత్యధిక విజయాలు సాధించిన జట్టు దిల్లీ క్యాపిటల్స్(DC vs KKR 2021). లీగ్‌లో ఎంతో సమతూకంతో కనిపించిన జట్టు కూడా అదే. రెండు వారాల ముందు వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో దిల్లీ(IPL qualifier 2) తలపడితే విజయం ఎవరిదంటే చాలామంది రిషబ్ పంత్ జట్టు పేరే చెప్పేవాళ్లేమో! కానీ గత కొన్ని మ్యాచ్‌ల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రదర్శన చూశాక ఇప్పుడు దిల్లీ గెలుపుపై ధీమా కలగడం కష్టమే. తొలి అంచెలో పేలవ ప్రదర్శనతో ప్లేఆఫ్స్ రేసులోనే లేదనుకున్న జట్టు యూఈఏలో రెండో అంచెలో దూకుడుగా ఆడి చివరి 8 మ్యాచ్‌ల్లో ఆరు నెగ్గి రెండో క్వాలిఫయర్‌కు సిద్ధమైన జట్టు నైట్‌రైడర్స్. మరి సమవుజ్జీల పోరులా కనిపిస్తున్న ఈ మ్యాచ్‌లో నెగ్గి చెన్నైతో టైటిల్ పోరుకు అర్హత సాధించే జట్టేదో?
లీగ్ దశలో తొలి ముఖాముఖి మ్యాచ్‌లో దిల్లీ నెగ్గగా.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా గెలిచింది. యూఏఈలో రెండో అంచె ఆరంభమైనప్పటి నుంచి కోల్‌కతా రెండోసారి బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ గెలిచింది. దిల్లీ ఈ సీజన్లో ఓడిన అయిదు మ్యాచ్‌లూ మొదట బ్యాటింగ్ చేసినప్పటివే. రెండో క్వాలిఫయర్ వేదికైన షార్జాలో ఈ సీజన్లో జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదుసార్లు లక్ష్యాన్ని ఛేదించిన జట్టే నెగ్గింది.
షార్జా
ఐపీఎల్-14లో మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. బుధవారమే రెండో క్వాలిఫయర్(IPL qualifier 2). సీజన్ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తున్న దిల్లీ క్యాపిటల్స్.. రెండో అంచె నుంచి గొప్పగా పుంజుకుని వరుస విజయాలతో రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించిన కోల్‌కతా నైట్‌రైడర్స్(IPL eliminator match) ఫైనల్లో చోటు కోసం అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. రెండు జట్లలో ఫేవరెట్ ఏదని చెప్పడం కష్టమే. అయితే గత కొన్ని మ్యాచ్‌ల ప్రదర్శన చూస్తే కోల్‌కతాదే కాస్త పైచేయిగా ఉంది. స్వదేశంలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో రెండే నెగ్గి ప్లేఆఫ్స్ రేసులోనే లేనట్లు కనిపించిన కోల్‌కతా.. యూఏఈలో రెండో అంచెలో చక్కటి ప్రదర్శన చేసింది. ఏడు మ్యాచ్‌ల్లో అయిదు నెగ్గి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ప్రతి మ్యాచ్ గండంగా మారిన స్థితిలో ఒత్తిడిలో ఆ జట్టు చేసిన ప్రదర్శన అద్భుతం. చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలతో ఆ జట్టు రెండో క్వాలిఫయర్‌కు సిద్ధమైంది. అదే సమయంలో దిల్లీ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. లీగ్ దశలో ముఖాముఖి మ్యాచ్‌ల్లో దిల్లీ, కోల్‌కతా తలో విజయం సాధించాయి. చివరి మ్యాచ్‌లో కోల్‌కతాదే పైచేయి.
జోరుమీద నైట్‌రైడర్స్
సొంతగడ్డపై తొలి అంచెలో నిరాశపరిచిన నైట్‌రైడర్స్.. రెండో అంచెలో పుంజుకున్న తీరు అనూహ్యం. ఆ జట్టులో ప్రధానంగా జరిగిన మార్పు దేశవాళీ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్‌ను ఓపెనర్‌గా తీసుకురావడం. గిల్‌తో కలిసి అతను చక్కటి ఆరంభాలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అతను పార్ట్‌టైం బౌలర్‌గా, ఫీల్డర్‌గానూ జట్టుకు బాగా ఉపయోగపడుతున్నాడు. చాలా మ్యాచ్‌ల్లో గిల్, వెంకటేశ్‌లే బ్యాటింగ్ భారాన్ని మోశారు. రాహుల్ త్రిపాఠి నితీశ్ రాణా కాస్త వీరికి తోడ్పాటునందించారు. మోర్గాన్, దినేశ్ కార్తీక్ పెద్దగా ఆడింది లేకున్నా కోల్‌కతా ఇక్కడిదాకా వచ్చేసింది. బౌలింగ్ నైట్‌రైడర్స్‌కు పెద్ద బలం అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ నిలకడగా రాణిస్తుండగా.. వీరికి షకిబ్ కూడా తోడయ్యాడు. నరైన్ అప్పుడప్పుడూ బ్యాటుతోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. షకిబ్ నాణ్యమైన బ్యాట్స్‌మన్ కూడా కావడం కలిసొచ్చే అంశం. పేస్ విభాగంలో ఫెర్గూసన్, మావి కూడా రాణిస్తున్నారు. మొత్తంగా గత కొన్ని మ్యాచ్‌ల నుంచి నిలకడ, దూకుడుతో ఆకట్టుకుంటున్న కోల్‌కతా రెండో క్వాలిఫయర్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. అయితే ఓపెనర్లు విఫలమైతే, స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించకుంటే మాత్రం కోల్‌కతాకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
దిల్లీకి తలనొప్పులున్నా..