యూఏఈ వేదికగా ఐపీఎల్(IPL 2021 news) త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలకు పలు సూచనలు ఇచ్చింది బీసీసీఐ. బ్రిటన్ నుంచి యూఏఈకి వెళ్లే వారంతా.. బయోబబుల్‌లో చేరడానికి ముందు ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని పేర్కొంది.
"ఇంగ్లాండ్ నుంచి అబుదాబికి వెళ్లేవారంతా.. టీమ్ బయోబబుల్‌లో చేరడానికి ముందే ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. ఈ విషయం బీసీసీఐ అన్ని ఫ్రాంజైజీలకు స్పష్టంగా తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. ఆటగాళ్లను ఓ బబుల్ నుంచి మరో బబుల్‌కు పంపాలని నిర్ణయించుకుంది." అని ఓ ఫ్రాంచైజీకి చెందిన అధికారి తెలిపారు.
ప్రస్తుతం ఇంగ్లాండ్, టీమ్ఇండియా(Ind vs Eng 5th test) మధ్య జరగాల్సిన ఐదో టెస్టు రద్దయిన నేపథ్యంలో వివిధ ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను దుబాయ్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ సిరాజ్ కోసం ఆదివారం ప్రత్యేకంగా చార్టర్ ఫ్లైట్ ఏర్పాటు చేసినట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ సభ్యులు తెలిపారు. చెన్నై జట్టు కూడా తమ ఆటగాళ్లను దుబాయ్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ జట్టు సీఈఓ విశ్వనాథన్ పేర్కొన్నారు.