తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ విషయంలో బీసీసీఐ నిర్ణయంపై ఐపీఎల్​ ఫ్రాంచైజీలు అసహనం

SouthAfrica League Indian players: విదేశీ లీగ్స్‌లో భారత ఆటగాళ్లను అనుమతించకపోవడం సరైన నిర్ణయం కాదని ఐపీఎల్​ ఫ్రాంచైజీలు అభిప్రాయపడుతున్నాయి. ఇలా చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయేది ఉంటుందని అంటున్నాయి.

dhoni IPL
ధోనీ ఐపీఎల్​

By

Published : Aug 15, 2022, 2:18 PM IST

SouthAfrica League Indian players: విదేశీ లీగ్స్‌లో భారత ఆటగాళ్లను అనుమతించేది లేదని, ఎవరైనా బోర్డు నిబంధనలు పాటించాల్సిందేనని బీసీసీఐ తేల్చి చెప్పడం సరైన నిర్ణయం కాదని ఐపీఎల్ ఫ్రాంచైజీలు అభిప్రాయపడుతున్నాయి. ఇది చాలా అన్యాయమని, ఆటగాళ్లపై కోట్ల రూపాయలు పెట్టామని, ఇలాంటి నిర్ణయాలతో తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

కాగా, యూఏఈ, సౌతాఫ్రికా వేదికగా జరగనున్న టీ20 లీగ్స్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు పెట్టుబడులు పెట్టాయి. అయితే దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో మొత్తం 6 జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే కొనుగోలు చేశాయి. ముంబయి ఇండియన్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు సౌతాఫ్రికా లీగ్‌లో భాగమయ్యాయి. ఈ క్రమంలోనే తమ ఐపీఎల్ ఆటగాళ్లను అక్కడ ఆడించాలనుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తమ జోహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ జట్టుకు మెంటార్‌గా నియమించాలనుకుంది. కానీ బీసీసీఐ మాత్రం ఆ ఫ్రాంచైజీకి షాకిచ్చింది.

భారత ఆటగాళ్లు విదేశీ లీగ్స్ ఆడే విషయంలో తమ నిర్ణయం మారదని ఇటీవలే ఓ బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు. విదేశీ లీగ్స్ ఆడాలనుకుంటే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని సూచించింది. ఏ ఆటగాడైనా సరే ఈ నిబంధన వర్తిస్తుందని పరోక్షంగా ధోనీని ఉద్దేశించి పేర్కొంది.

దీంతో ఆటగాళ్ల విషయంలో బోర్డు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని ఫ్రాంచైజీలు అభిప్రాయపడుతున్నాయి. "ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి ఈ అంశంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మీడియాలో వస్తున్న కథనాలను మాత్రమే చూస్తున్నాం. ఒకవేళ అవి నిజమైతే బోర్డు నిర్ణయం చాలా అన్యాయమైంది. ఎందుకంటే మాకు అందుబాటులో ఉన్న వనరులకు మేం ఎక్కడైనా ఉపయోగించుకునే హక్కు మాకు ఉంటుంది. ఒకవేళ బీసీసీఐ మేం చేసేది కరెక్ట్​ కాదని భావిస్తే.. అలా ఎందుకు అనుకుంటుందో సరైన కారణాలు చెప్పాలి. భారత్‌ సహా విదేశీ లీగుల్లో పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి ప్లేయర్లను తీసుకుంటున్నాం. వాళ్లను ఎక్కడైనా ఉపయోగించుకునే అవకాశం మాకు ఇవ్వాలి. లేకపోతే మేం చాలా నష్టపోతాం" అని ఓ ఫ్రాంచైజీ అధికారి ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి: అమ్మాయి ఆట ప్రగతికి బాట అంటున్న దిగ్గజ క్రికెటర్​ సచిన్​

ABOUT THE AUTHOR

...view details