తెలంగాణ

telangana

పూరన్​పై క్రిస్​ గేల్​ ఫన్నీ కామెంట్స్​.. అది తిరిగిచ్చేయ్​ అంటూ..

By

Published : Dec 24, 2022, 3:33 PM IST

టీ20 మెరుపు ఆటగాడు క్రిస్​ గేల్​కు చాలా మంది అభిమానులున్నారు. అతడు ప్రేక్షకులను అలరించడమే తన విధిగా దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. సందర్భానుసారం సరదాగా స్పందించడం గేల్‌ అదనపు ఆకర్షణ. తాజాగా ఐపీఎల్‌ మినీ వేలంలో భారీ ధరను సొంతం చేసుకున్న ఆటగాళ్లను అభినందించాడు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ipl 2023 mini auction  chris gayle
ipl 2023 mini auction chris gayle

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2023 మినీ వేలం ముగిసింది. ఆల్‌రౌండర్లు భారీ ధరను సొంతం చేసుకొన్నారు. మరీ ముఖ్యంగా గత టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌ అవార్డును దక్కించుకొన్న శామ్‌ కరన్ ఈ వేలంలో ఏకంగా రూ. 18.50 కోట్లను సొంతం చేసుకొని రికార్డు సృష్టించాడు. కామెరూన్ గ్రీన్ (రూ. 17.50 కోట్లు), బెన్ స్టోక్స్ (రూ. 16.25 కోట్లు) దక్కించుకొన్నారు. ఈ క్రమంలో యూనివర్సల్‌ బాస్ క్రిస్‌ గేల్‌ తనదైన శైలిలో స్పందించాడు. అత్యధిక ధరను సొంతం చేసుకున్న ఆటగాళ్లను ప్రైవేట్ జెట్ కేటగిరీ' ప్లేయర్లుగా అభివర్ణించాడు.

"ఐపీఎల్‌ మినీ వేలంలో భారీ ధరను సొంతం చేసుకొన్న శామ్, బెన్, గ్రీన్‌.. ఈ ముగ్గురూ ప్రైవేట్ జెట్‌ కేటగిరీ ఆటగాళ్లు" అని ప్రశంసించిన క్రిస్‌ గేల్‌.. విండీస్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్ (రూ.16 కోట్లు)పైనా ఛలోక్తి విసిరాడు. "నికోలస్‌ నేను అప్పుగా ఇచ్చిన సొమ్ము వెనక్కి తిరిగిచ్చేయి ప్లీజ్‌" అని సరదాగా స్పందించాడు.

రూ.13.25 కోట్లతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతమైన హ్యారీ బ్రూక్‌ను ఉద్దేశించి గేల్‌ మాట్లాడుతూ.. "బ్రూక్‌.. తొందరగా బ్యాంక్‌ను బద్దలు కొట్టేయ్‌. అక్కడ చాలా డబ్బు ఉంది. నిజంగా చాలా మంచి అవకాశం. ఉత్తమ ఆటగాడైన బ్రూక్‌తోపాటు మయాంక్‌ను హైదరాబాద్‌ సొంతం చేసుకొంది. సన్‌రైజర్స్‌ తన బ్యాటింగ్‌ విభాగాన్ని బలోపేతం చేసింది" అని అభినందించాడు.

ABOUT THE AUTHOR

...view details