తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: అన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్​.. ఈ సారి అద్భుతాలు సృష్టించారుగా! - ఐపీఎల్ 2022 అన్​ క్యాపడ్​ ప్లేయర్​

IPL 2022 Uncapped players: ఐపీఎల్​ చివరి దశకు చేరుకుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా కొంతమంది యువ ఆటగాళ్లు అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ మేరకు 2022 సీజన్‌లో అద్భుతాలు సృష్టించిన పలువురు అన్‌క్యాప్‌డ్‌ ఆటగాళ్లు ఎవరో చూద్దాం..

IPL 2022 Uncapped players
IPL 2022 Uncapped players

By

Published : May 11, 2022, 12:35 PM IST

IPL 2022 Uncapped players: నాణేనికి బొమ్మాబొరుసూ రెండు వైపులుంటాయ్‌. భారత్‌లో ఏటా జరిగే మెగా టీ20 టోర్నీకీ అంతే! ప్రపంచ సంపన్న లీగ్‌గా ఈ టోర్నీపై ఎన్ని విమర్శలున్నా.. కొత్త టాలెంట్‌ను వెలికితీయడంలో దీన్ని మించిన ఈవెంట్‌ మరొకటి లేదు. అందువల్లే జాతీయ జట్టులోకి ప్రవేశించడానికి ఈ టోర్నీనే ట్రాక్‌గా ఎంచుకుంటున్నారు మేటి కుర్రాళ్లు. ప్రపంచ ఆటగాళ్లకు సైతం సిగపాట్లు పట్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ మేరకు 2022 సీజన్‌లో పలువురు అన్‌క్యాప్‌డ్‌ ఆటగాళ్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు.

హైదరాబాద్‌ కుర్రాడు.. తిలక్‌..ముంబయి జట్టులో ఈసారి 19 ఏళ్ల హైదరాబాద్‌ కుర్రాడు తిలక్‌ వర్మ ఆటే హైలైట్‌. జట్టు ఓటములు పక్కనపెడితే ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో రెండు అర్ధశతకాలు సహా తిలక్‌ 334 పరుగులు చేశాడు. జట్టులో సీనియర్‌ బ్యాటర్లు సైతం చేతులెత్తేస్తున్న వేళ.. అతనొక్కడే అదిరే బ్యాటింగ్‌తో మెరుగైన స్కోరు సాధిస్తున్నాడు. ఇకపైనా ఇలాగే ఆడితే భవిష్యత్తు టీమ్‌ఇండియాకు తిలక్‌ వర్మ ప్రాతినిధ్యం వహిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సీజన్‌లో తిలక్‌ అత్యధిక స్కోర్‌ 61, స్ట్రైక్‌రేట్ 136.66.

అభిషేక్.. అంచనాలకు మించి..హైదరాబాద్‌ యువ ఓపెనర్‌ అభిషేక్ శర్మ ఈసారి అంచనాలకు మించి రాణిస్తున్నాడు. పంజాబ్‌కు చెందిన ఈ 21 ఏళ్ల ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్‌ తన 11 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 331 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నైపై గెలుపులో అభిషేక్‌ శర్మ (75) అమోఘమైన ఇన్నింగ్స్‌ ఆడి ఔరా అనిపించాడు. అత్యధిక స్కోర్ 75, స్ట్రైక్‌ రేట్ 132.40.

అరంగ్రేటంలోనే అద్భుతం..గుజరాత్‌ యువ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుతంగా ఆడాడు. ఎటువంటి భయం కనిపించకుండా చక్కటి షాట్లు ఆడుతూ ఏకంగా 35 పరుగులు రాబట్టాడు. ఆపై పంజాబ్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో 65 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల సుదర్శన్‌ ఇప్పటివరకు ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 145 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్‌ సెంచరీ ఉంది. అత్యధిక స్కోర్‌ 65 నాటౌట్‌. స్ట్రైక్‌రేట్ 127.19.

ఫినిషర్‌ బదోని..గుజరాత్‌తో జరిగిన అరంగేట్ర మ్యాచ్‌లోనే అర్థశతకం సాధించాడు లఖ్‌నవూ ఆటగాడు ఆయుష్‌ బదోని (54). ఆపై చెన్నై, దిల్లీతో మ్యాచ్‌ల్లో ఫినిషర్‌గా బౌండరీలు బాది జట్టును గెలిపించాడు. ఇప్పటివరకు ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో హాఫ్‌ సెంచరీ సహా బదోని 161 పరుగులు చేశాడు. మూడుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. అత్యధిక స్కోర్‌ 54, స్ట్రైక్‌రేట్ 129.66.

అలాగే మరో కొత్త జట్టు గుజరాత్‌లో అభినవ్‌ (7 మ్యాచ్‌ల్లో 108) అవకాశం వచ్చినప్పుడల్లా తన మెరుపు బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. మరోవైపు బెంగళూరు బ్యాటర్లలో రజత్‌ పటిదార్‌ (4 ఇన్నింగ్స్‌ల్లో 137), అనుజ్‌ రావత్‌ (8 ఇన్నింగ్స్‌ల్లో 129) నిలకడగా రాణిస్తున్నారు.

బుల్లెట్‌ బంతుల ఉమ్రాన్‌..ఈ సీజన్‌లో ప్రధాన చర్చంతా హైదరాబాద్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ గురించే. బులెట్‌ బంతులతో ఈసారి అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఉమ్రాన్‌. గుజరాత్‌తో మ్యాచ్‌లో 25 పరుగులే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఇందులో నాలుగు బౌల్డ్‌లు కాగా.. ఒకటి క్యాచ్‌ ఔట్. అంతేకాకుండా 150 కి.మీ వేగంతో స్థిరంగా బంతులను సంధిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచుల్లో ఉమ్రాన్‌ 15 వికెట్లు పడగొట్టాడు.

ముకేశ్‌ చౌదరీ..రాజస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ ముకేశ్‌ చౌదరీ ఈ సీజన్లో గొప్పగా రాణిస్తున్నాడు. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లు ఆడి ముకేశ్‌ 13 వికెట్లు పడగొట్టాడు. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 9 పరుగులకే మూడు వికెట్లు తీసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు.

యూపీకి చెందిన యువ పేసర్‌ మోసిన్‌ ఖాన్‌.. ఈసారి లఖ్‌నవూ తరఫున ఆడుతున్నాడు. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మోసిన్‌‌‌ కేవలం 16 పరుగులే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చూడండి: IPL 2022: రషీద్​, గిల్​ అరుదైన రికార్డు.. సచిన్​, బ్రావో సరసన చోటు

ABOUT THE AUTHOR

...view details