IPL 2022: ఎంత అద్భుతంగా బౌలింగ్ చేసినా.. క్యాచ్‌లను నేలపాలు చేస్తే కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. బౌండరీకి వెళ్లే బంతిని ఆపి ఒక్క పరుగే రానిస్తే.. అది సూపర్ ఫీల్డింగ్ అంటాం కదా.. అలానే దూరంగా, వేగంగా గాల్లోకి లేచిన బంతిని ఒడిసి పట్టుకుంటే సూపర్ క్యాచ్ అవుద్ది. ఒకే ఒక్క క్యాచ్‌తో మ్యాచ్ రూపురేఖలు మారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నెల 26న ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇప్పటివరకు లీగ్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లను పట్టిన ఆటగాళ్లు ఎవరో ఓ సారి చూద్దాం.
సురేష్ రైనా..
భారత క్రికెట్ చరిత్రలో గొప్ప ఫీల్డర్లలో ఒకడు సురేష్ రైనా. ఐపీఎల్‌లో 102 మ్యాచులు ఆడి 104 క్యాచులు పట్టాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడు రైనానే. ఐపీఎల్‌లో సుదీర్ఘకాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన రైనాను ఈ ఏడాది ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. అయితే ఈ సీజన్లో కొత్తగా చేరిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఆటగాడు జేసన్‌రాయ్ లీగ్ మొదలవ్వకముందే వైదొలిగాడు. ఈ క్రమంలో రైనాను తీసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇటీవలే అఫ్గాన్ ఆటగాడిని తీసుకుంటున్నట్లు గుజరాత్ టైటాన్స్ ప్రకటించింది.
కీరన్ పొలార్డ్..
పొడుగ్గా ఉండే ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్.. ఎక్కువగా లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తుంటాడు. ఈ ఆటగాడు బౌండరీ లైన్ దగ్గరకి వచ్చిన ఏ క్యాచ్‌ను వదలడు. ఎన్నో సార్లు బౌండరీలకు వెళ్లే బంతులను ఒంటిచేత్తో పట్టి ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ చరిత్రలో పొలార్డ్ ఇప్పటివరకు 90 క్యాచ్‌లు పట్టాడు.
రోహిత్ శర్మ
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కువగా సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తుంటాడు. ఇప్పటి వరకు 207 ఐపీఎల్ మ్యాచులాడిన హిట్‌మ్యాన్ 89 క్యాచులను పట్టుకున్నాడు. ఇతని సారథ్యంలోనే ముంబయి ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించింది.