తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: మట్టిలో మాణిక్యాలు... ఈ కుర్రాళ్ల ఆట చూడాల్సిందే! - ఐపీఎల్ కొత్త ప్లేయర్లు

ipl 2022 hidden gems: ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 టోర్నీ... ఇందులో దుమ్మురేపితే జాతీయ జట్టులో చోటు ఖాయం అనే భావన... అందుకే కుర్రాళ్లంతా ఐపీఎల్​లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. ఈసారీ కొంతమంది టోర్నీ కోసం ఎదురుచూస్తున్నారు. వారెవరు? వారి ప్రత్యేకతలేంటి?

ipl 2022 hidden gems
ipl 2022 hidden gems

By

Published : Mar 26, 2022, 11:16 AM IST

ipl 2022 hidden gems: బ్యాట్‌తో వీర బాదుడు బాది.. బంతితో వికెట్లు కూల్చి అనూహ్యంగా మ్యాచ్‌ను మలుపు తిప్పే యువ ఆటగాళ్లను ఏరికోరి టీ20 లీగ్‌ జట్లు కొనుగోలు చేశాయి. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో తమ జట్టు బలాన్ని పెంచుకునేందుకు వారికి భారీ మొత్తాన్ని వెచ్చించాయి. వీరిలో కొంత మంది పేర్లు, వారి ఆటతీరు పరిచయం ఉన్నప్పటికీ మరికొంత మంది హిడెన్‌ జెమ్స్‌ గురించి తెలియకపోవచ్చు. మరి నిజంగానే మ్యాచ్‌ను మలుపు తిప్పే అంత సత్తా వీరిలో ఉందా? అసలు ఆ హిడెన్‌ ప్లేయర్స్‌ ఎవరు? వారి ప్రత్యేకతలేంటి?

Baby AB IPL:దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ ఎంతటి విధ్వంసకారుడో మనందరికీ తెలిసిందే. అచ్చం మిస్టర్‌ 360ని తలపించేలా బ్యాట్‌ను ఝుళిపిస్తే ఆ ఆటగాడిని ఏమంటారు? అంతటి సత్తా ఉన్న యువ ఆటగాడే డేవాల్డ్‌ బ్రెవిస్‌. అందుకే ఇతన్ని ముద్దుగా ‘బేబీ డివిలియర్స్‌’ అని కూడా పిలుస్తారు. అండర్‌ -19 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు (506) చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకొన్నాడు. ప్రపంచకప్‌ టోర్నీలో 84.33 సగటుతో మెరుగైన ప్రదర్శన చేసి రికార్డులకెక్కాడు. ఇంతటి ప్రతిభ ఉన్న ఆటగాడిని ఏ జట్టు వదులుకుంటోంది? అందుకే మెగావేలంలో 18 ఏళ్ల బేబీ డివిలియర్స్‌ను కొనుగోలు చేయడానికి ముంబయి ఆసక్తి చూపెట్టింది. వేలంలో కనీస ధర రూ.20లక్షలు ఉన్న అతనికి ఏకంగా రూ. 3 కోట్లు వెచ్చించింది.

డెవాల్డ్ బ్రెవిస్

విధ్వంసకర బ్యాటర్‌ టిమ్ డేవిడ్‌..:మెగాటోర్నీలో పరుగుల వరద పారించడంతో పాటు బౌలింగ్‌తోనూ ప్రత్యర్థిని కట్టడి చేసే మరో సత్తా ఉన్న ఆల్‌రౌండర్‌ టిమ్‌ డేవిడ్‌. సింగపూర్‌కు చెందిన ఇతను బిగ్‌ బాష్‌ సహా చాలా టీ20 లీగ్‌ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేశాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో క్షణాల్లో మ్యాచ్‌ ఫలితాలు మార్చేయగల సత్తా ఇతనికి ఉంది. బ్యాట్‌తో పవర్‌ హిట్టింగ్‌ చేయగల సమర్థుడు. ఆఫ్‌ స్పిన్‌తో మాయ చేసి బ్యాట్స్‌మెన్స్‌ను కట్టడి చేయగలడు. మెగాటోర్నీ వేలానికి ముందు బిగ్‌ బాష్‌, పీఎస్‌ఎల్‌, సీపీఎల్‌లో అదరగొట్టడంతో డేవిడ్‌కు వేలంలో డిమాండ్‌ పెరిగిపోయింది. ఇతన్ని కొనుగోలు చేయడానికి రాజస్థాన్‌, కోల్‌కతా, ముంబయి పోటీ పడ్డాయి. రూ. 40లక్షల కనీస ధర ఉన్న టిమ్‌ డేవిడ్‌ను చివరకు ముంబయి రూ.8.25 కోట్లకు సొంతం చేసుకుంది.

టిమ్ డేవిడ్‌

ipl yash dhul:అండర్‌-19 జట్టు సారథిగా ఉంటూ భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన ఆటగాడు యాష్ ధుల్. ప్రపంచకప్‌ టోర్నీ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో (110 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. యాష్ ధుల్ సారథ్యంలోనే టీమిండియా ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. రంజీ ట్రోఫీలోనూ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ప్రపంచకప్‌ టోర్నీ మొత్తంలో 229 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. రూ.20 లక్షలు కనీస ధర ఉన్న అతడిని దిల్లీ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది.

యాష్ ధుల్

హడలెత్తించే హంగర్గేకర్..:అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన మరో ఆటగాడు రాజవర్ధన్ హంగర్గేకర్. ప్రపంచకప్‌ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేశాడు. ఐర్లాండ్‌పై 17 బంతుల్లో 39 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదాడు. ప్రపంచకప్‌లో 185 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడంతో పాటు.. 5 వికెట్లు కూడా తీశాడు. విజయ్‌ హజారే ట్రోఫీ, సయ్యద్‌ ముస్తఫ్‌ అలీ ట్రోఫీలోనూ తనదైన పాత్ర పోషించాడు. రాజ్‌వర్ధన్‌ బ్యాట్‌తో భారీ షాట్లను ఆడడంతో పాటు మంచి పేసర్‌ కూడా. అతడి ఆటతీరును చూసిన రవిచంద్రన్ అశ్విన్ మెగా వేలంలో భారీగానే ధర పలుకుతాడు అని జోస్యం చెప్పాడు. అశ్విన్‌ ఊహించినట్టుగానే రాజ్‌వర్ధన్‌ వేలంలో రూ. 1.5 కోట్లకు అమ్ముడుపోయాడు. అతడిని చెన్నై కొనుగోలు చేసుకుంది.

హంగర్గేకర్

బౌలింగ్‌లో భళా.. రాజ్‌ భవా..:అండర్-19 ప్రపంచ కప్‌ టోర్నీలో అదరగొట్టిన మరో ఆల్‌రౌండర్‌ అంగద్ రాజ్‌ భవా. టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఎనిమిదో ఆటగాడిగా ఉన్నాడు. ప్రపంచకప్‌ టోర్నీలో 63 సగటుతో 252 పరుగులు సాధించాడు. స్ట్రైక్‌రేట్‌ 100కు పైగానే ఉంది. అంతేకాకుండా బౌలింగ్‌లో విజయవంతమైన మూడో అత్యుత్తమ బౌలర్. అతడు వేసిన ఫస్ట్‌ డెలీవరీలోనే తొలి వికెట్‌ తీశాడు. ప్రపంచకప్‌ టోర్నీలో 16.66 బౌలింగ్ సగటుతో మొత్తం 9 వికెట్లు తీశాడు. భారత్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు సాధించాడు. అంతేకాకుండా అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలోనే అందరి దృష్టిలో పడ్డాడు. రూ.20 లక్షల కనీస ధరతో మెగా వేలంలో పాల్గొన్న అతన్ని రూ. 2 కోట్లతో పంజాబ్‌ కొనుగోలు చేసింది.

రాజ్‌ భవా

హైదరాబాదీ తిలక్‌ వర్మ..:మెగాటోర్నీ వేలంలో తాను ఊహించనంత ఎక్కువ ధర పలికిన హైదరాబాదీ ప్లేయర్‌ ఠాకూర్‌ తిలక్‌ వర్మ. 2020 అండర్‌-19 ప్రపంచకప్‌ ద్వారా వెలుగులోకి వచ్చాడు. గత సీజన్‌లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 147.26 స్ట్రైక్‌రేట్‌తో 215 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ఇప్పటివరకూ మొత్తంగా 15 టీ20ల్లో 143.77 స్ట్రైక్‌రేట్‌తో 381 పరుగులు సాధించాడు. కనీస ధర రూ. 20 లక్షలతో వేలంలోకి వచ్చిన అతణ్ని అంతకంటే 8.5 రెట్లు (రూ.1.70కోట్లు) ఎక్కువ వెచ్చించి ముంబయి సొంతం చేసుకుంది.

తిలక్‌ వర్మ..

మెరిపించే షారుక్‌..:2014 విజయ్‌ హజారే ట్రోఫీ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆల్‌రౌండర్‌ షారుక్‌ఖాన్‌. 2016 అండర్‌-19 వరల్డ్‌ కప్‌, రంజీ ట్రోఫ్రీలో ఆడిన అనుభవమూ ఉంది. ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీ-2022లో 89 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి తమిళనాడుకు పవర్‌ ప్యాక్‌ ఇన్నింగ్స్ అందించాడు. గతేడాది టీ20 లీగ్‌లో షారుక్‌ ఖాన్‌ పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడాడు. 11 మ్యాచుల్లో 153 పరుగులు చేశాడు. చెన్నై తరఫున ఆడిన మ్యాచులో 36 బంతుల్లో 47 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. అందుకే మెగా వేలం-2022లో మళ్లీ.. పంజాబ్‌ భారీ మొత్తం వెచ్చించి రూ.9 కోట్లకు షారుక్‌ ఖాన్‌ను సొంతం చేసుకుంది.

షారుక్‌

క్రిస్‌ గేల్‌ ఆఫ్‌ ఇండియా.. మహిపాల్‌:2016లో అండర్‌-19 వరల్డ్‌కప్‌లో ఆడిన మరో ఆల్‌రౌండర్‌ మహిపాల్‌ లామ్రోర్‌. 2016లో రంజీ ట్రోఫీలో, 2017 విజయ్‌ హజారే ట్రోఫీలో, 2019 దులీప్‌ ట్రోఫీలోనూ ఆడిన అనుభవం ఉంది. తను ఆడిన రంజీ ట్రోఫీలోని 6 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి వికెట్‌ టేకర్‌గా వెలుగులోకి వచ్చాడు. మిడిల్‌ అర్డర్‌లో కీలకమైన బ్యాటరే కాకుండా మంచి ఫినిషర్‌గా పేరు సంపాదించుకున్నాడు. అవలీలగా సిక్సులు బాదే నైపుణ్యం అతడి సొంతం. అందుకే అతడిని ‘క్రిస్‌ గేల్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తారు. అంతేకాకుండా మెగాటోర్నీ 2018 సీజన్‌లో రాజస్థాన్‌ కొనుగోలు చేయగా ఆ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే 17 బంతుల్లో 43 పరుగులు చేశాడు. మెగాటోర్నీ 15వ సీజన్‌-2022లో ఇతన్ని బెంగళూరు కొనుగోలు చేసుకుంది. రూ.20లక్షల కనీస ధరతో ఉన్న అతని కోసం రూ.95లక్షలు వెచ్చించి బెంగళూరు సొంతం చేసుకుంది.

ఇదీ చదవండి:IPL 2022: ఇవి మామూలు రికార్డులు కావు.. ఈసారి బ్రేక్​ చేస్తారా?

ABOUT THE AUTHOR

...view details