IPL 2022 Bio Bubble Rules: మరో పదిరోజుల్లో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. అందుకోసం బీసీసీఐ కఠినమైన బయోబబుల్ నిబంధనలను సిద్ధం చేసింది. కోవిడ్ విజృంభణతో గతేడాది అనుభవాల దృష్ట్యా ఈ సారి నిబంధనలను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. వాటిని ఉల్లంఘిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది.
మొదటిసారి ఏడు రోజులు క్వారంటైన్..
ఏ ఆటగాడైనా తొలిసారి బుడగ దాటితే తప్పనిసరిగా ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. రెండోసారి ఉల్లంఘనకు పాల్పడితే ఒక మ్యాచ్ నిషేధం, మూడోసారి బుడగ దాటితే ఏకంగా లీగ్ నుంచి తొలగిస్తామని గట్టిగా హెచ్చరించింది. అలాంటి పరిస్థితి ఎదురైతే ప్రత్యమ్నాయ ఆటగాడిని సైతం అనుమతించమని పేర్కొంది.
ఫ్రాంచైజీలకూ..
ఏ జట్టు ఆటగాడైనా తొలిసారి బుడగ దాటితే సదరు ఫ్రాంచైజీకి రూ.కోటి జరిమానా విధిస్తామని బీసీసీఐ తెలిపింది. రెండో సారి ఇదే జరిగితే ఒక పాయింట్ కోత, మూడో సారికైతే రెండు పాయింట్ల కోత ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది.