తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోల్‌కతాతో బెంగళూరు ఢీ- ఎలిమినేటర్‌లో నిలిచేదెవరో? - కేకేఆర్-ఆర్​సీబీ

తొలి ఐపీఎల్‌ టైటిల్‌ వేటలో సాగుతోన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB vs Kolkata) కఠిన పరీక్షకు సిద్ధమైంది. ఆర్సీబీ కెప్టెన్‌గా ఇదే తన చివరి సీజన్‌ అని ప్రకటించి.. జట్టుకు తొలి ట్రోఫీ అందించే దిశగా పయనిస్తున్న కోహ్లీకి మరో సవాలు ఎదురు కానుంది. సోమవారం ఎలిమినేటర్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ఇంటి ముఖం పట్టాల్సిందే కాబట్టి విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడడం ఖాయం.

IPL 2021 Eliminator
కోల్‌కతాతో బెంగళూరు ఢీ

By

Published : Oct 11, 2021, 7:21 AM IST

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో (IPL 2021 updates)ఎలిమినేటర్‌లో గెలిచి టైటిల్‌ రేసులో నిలిచేందుకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌(RCB vs Kolkata) బ్యాట్లు దూసుకోనున్నాయి. బలాబలాల్లో రెండు జట్లు సమానంగానే కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో లీగ్‌ దశలో(IPL 2021 ) ఆడిన మ్యాచ్‌ల్లో రెండు జట్లు చెరో దాంట్లో గెలిచాయి. 14 మ్యాచ్‌ల్లో.. 9 విజయాలతో 18 పాయింట్లు సాధించి మూడో స్థానంతో ఆర్సీబీ ముందంజ వేయగా.. ఏడింట్లో నెగ్గిన కేకేఆర్‌ 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన చివరి జట్టుగా నిలిచింది.

పైచేయి ఎవరిదో?

లీగ్‌ ఆరంభం నుంచి ఆర్సీబీ జోరు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా చివరి లీగ్‌ మ్యాచ్‌లో(RCB vs KKR) దిల్లీపై ఆఖరి బంతికి కేఎస్‌ భరత్‌ సిక్సర్‌తో విజయాన్ని అందుకున్న జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఓపెనర్లు దేవ్‌దత్‌ పడిక్కల్‌, కోహ్లి, అద్భుత ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్‌, డివిలియర్స్‌తో పాటు తెలుగు కుర్రాడు భరత్‌తో కూడిన బ్యాటింగ్‌ విభాగం పటిష్ఠంగా ఉంది. ఇక బౌలింగ్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్న హర్షల్‌ (30)తో పాటు సిరాజ్‌, గార్టన్‌ల పేస్‌ త్రయం ప్రత్యర్థికి సవాలు విసిరేదే. ఇక స్పిన్నర్‌ చాహల్‌ బంతితో మాయ చేస్తున్నాడు. మరోవైపు తొలి ఏడు మ్యాచ్‌ల్లో రెండింట్లో మాత్రమే గెలిచి అసలు ప్లేఆఫ్స్‌కు చేరుతుందా? అనిపించిన కేకేఆర్‌.. గొప్ప పోరాట స్ఫూర్తితో యూఏఈ అంచెలో మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదు విజయాలు సాధించి ముందంజ వేసింది. బ్యాటింగ్‌లో భారత కుర్రాళ్లు శుభ్‌మన్‌, వెంకటేశ్‌, త్రిపాఠి, నితీశ్‌ కీలకంగా మారారు. స్పిన్నర్లు వరుణ్‌, నరైన్‌, షకీబ్‌తో పాటు పేసర్లు ఫెర్గూసన్‌, శివమ్‌ జోరుమీదున్నారు.

జట్లు (అంచనా)...

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: దేవ్‌దత్‌, కోహ్లి, భరత్‌, మ్యాక్స్‌వెల్‌, డివిలియర్స్‌, షాబాజ్‌, క్రిస్టియన్‌, గార్టన్‌, హర్షల్‌, సిరాజ్‌, చాహల్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: శుభ్‌మన్‌ గిల్‌, వెంకటేశ్‌, నితీశ్‌, త్రిపాఠి, దినేశ్‌ కార్తీక్‌, మోర్గాన్‌, షకీబ్‌, నరైన్‌, ఫెర్గూసన్‌, వరుణ్‌, మావి

పిచ్‌ ఎలా ఉంది?

షార్జా పిచ్‌ నెమ్మదిగా స్పందిస్తోంది. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన ఎనిమిది మ్యాచ్‌ల్లో రెండు సార్లు మాత్రమే ఓ ఇన్నింగ్స్‌లో 160కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ.

ఇదీ చూడండి:నువ్వు చచ్చిపోతే బాగుండు అని అన్నారు: వరుణ్​

ABOUT THE AUTHOR

...view details