కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్‌పై మరోసారి ఫిర్యాదు నమోదైంది. శనివారం రాత్రి పంజాబ్, కోల్‌కతా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో నరైన్ బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఆన్‌ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫెనీ, ఉల్హాస్ బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.
'నరైన్‌ను హెచ్చరిక జాబితాలో ఉంచుతున్నాం. ప్రస్తుతం అతను బౌలింగ్ వేయవచ్చు. అయితే మరోసారి ఫిర్యాదు వస్తే మాత్రం బీసీసీఐ నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు నరైన్ బౌలింగ్ వేసే అవకాశం ఉండదు' అని ప్రకటనలో బీసీసీఐ పేర్కొంది.
కోల్‌కతా స్పిన్నర్ సునీల్ నరైన్ గతంలోనూ పలుమార్లు నరైన్ కొన్ని మ్యాచ్‌ల నుంచి నిషేధం ఎదుర్కొన్నాడు. ఈ కారణంగా 2015 వరల్డ్‌కప్ టోర్నీకి దూరమయ్యాడు. 2016లో ఐసీసీ అతని బౌలింగ్‌కు క్లియరెన్స్ ఇచ్చింది. 2018లో పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడే క్రమంలో మరోసారి అతని బౌలింగ్‌పై ఫిర్యాదు వచ్చింది. టీ20 లీగ్‌లో ఆడేందుకు బీసీసీఐ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. దీంతో కోల్‌కతా యాజమాన్యం అతడ్ని జట్టులోకి తీసుకుంది. బీసీసీఐ చేసిన సూచనల మేరకు నరైన్ తన బౌలింగ్ శైలి మార్చుకుని బౌలింగ్ చేస్తున్నాడు. ఆ కారణంగా అతను మునుపటిలా బౌలింగ్‌లో ప్రభావం చూపించలేకపోతున్నాడన్న వాదన కూడా ఉంది.
పంజాబ్ విజయానికి 18 బంతుల్లో 22 పరుగులు అవసరమైన సమయంలో నరైన్ బౌలింగ్‌కు వచ్చాడు. ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు అవసరం ఉండగా కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో కోల్‌కతా రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. ఇప్పటి వరకూ 347 టీ20 మ్యాచ్‌లాడిన నరైన్ 390 వికెట్లు తీశాడు. ఎకానమీ 6.04 కూడా చాలా తక్కువ. టీ20 లీగ్‌లో అతను 116 మ్యాచ్‌లాడి 127 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఎకానమీ 6.74గా ఉంది. ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్ అయిన నరైన్ బౌండరీలు కూడా అలవోకగా బాదగలడు.