తెలంగాణ

telangana

By

Published : Oct 25, 2020, 11:19 PM IST

Updated : Oct 26, 2020, 7:14 AM IST

ETV Bharat / sports

ముంబయిపై రాజస్థాన్​ అద్భుత విజయం

అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​పై రాజస్థాన్​ రాయల్స్ ఎనిమిది వికెట్ల ​తేడాతో విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాయల్స్​.. 18.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్టోక్స్​(107) అద్భుత శతకంతో మెరవగా, సంజూ శాంసన్​(54) అర్ధ శతకం బాది విజయంలో కీలక పాత్ర పోషించారు. మిగతా వారు విఫలమయ్యారు. ముంబయి బౌలర్లలో జేమ్స్​ ప్యాటిన్స్​న్​ రెండు వికెట్లు తీశాడు.

rajasthan royals
ముంబయిపై రాజస్థాన్​ విజయం

రాజస్థాన్​ రాయల్స్​ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​పై ఎనిమిది వికెట్ల ​తేడాతో ఘన విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాయల్స్​.. 18.2ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్టోక్స్​(107) అద్భుత శతకంతో మెరవగా, సంజూ శాంసన్​(54) హాఫ్ సెంచరీ బాది విజయంలో కీలక పాత్ర పోషించారు. మిగతా వారు విఫలమయ్యారు. ఈ విజయంతో ప్లేఆఫ్స్​ ఆశల్ని సజీవం చేసుకున్నట్లే! ముంబయి బౌలర్లలో జేమ్స్​ ప్యాటిన్స్​న్​ రెండు వికెట్లు తీశాడు.

అంతకముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ చేసిన ముంబయి...రాజస్థాన్‌ ముందు 196 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసినా హార్దిక్‌ పాండ్య (60*; 21 బంతుల్లో 2×4, 7×6) సూర్యకుమార్‌ యాదవ్‌ (40; 26 బంతుల్లో 4×4, 1×6), ఇషాన్‌ కిషన్‌ (37; 36 బంతుల్లో 4×4, 1×6), సౌరభ్‌ తివారి (33*; 23 బంతుల్లో 4×4, 1×6) బ్యాటింగ్‌లో రాణించారు. రాజస్థాన్​ బౌలర్లలో శ్రేయస్​ గోపాల్​(2), జోఫ్రా ఆర్చర్​(2), కార్తీక్​ త్యాగీ (1) వికెట్​ తీశారు.

సూర్య జోరు

ముంబయి 7 పరుగుల వద్దే డికాక్‌ (6) వికెట్‌ చేజార్చుకున్నా ముంబయి జోరేమీ తగ్గలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌, మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ రెచ్చిపోయారు. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదేసి 10 ఓవర్లకు జట్టును 89/1తో నిలిపారు. రెండో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని కిషన్‌ను ఔట్‌ చేయడం ద్వారా త్యాగి విడదీశాడు. అప్పుడు స్కోరు 90/2. అర్ధశతకం చేసిన సూర్య, అప్పుడే వచ్చిన కెప్టెన్‌ పొలార్డ్‌ను శ్రేయస్‌ గోపాల్‌ 13వ ఓవర్లో పెవిలియన్‌ పంపించాడు.

పాండ్య.. పవర్‌ నాక్

వరుసగా రెండు వికెట్లు చేజార్చుకోవడం వల్ల ముంబయి రన్‌రేట్‌ కాస్త తగ్గినట్టు అనిపించినా హార్దిక్‌ పాండ్యతో కలిసి సౌరభ్‌ తివారి మంచి షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో అంకిత్‌ రాజ్‌పుత్‌ వేసిన 18వ ఓవర్‌ను హార్దిక్‌ లక్ష్యంగా ఎంచుకున్నాడు. నాలుగు సిక్సర్లు బాదేసి 138/4గా ఉన్న స్కోరును ఓవర్‌ వ్యవధిలో 165/4కి చేర్చాడు. 19వ ఓవర్లో తివారిని ఔట్‌ చేసిన జోఫ్రా 3 పరుగులే ఇచ్చినా.. ఆఖరి ఓవర్లో పాండ్య మరింత భీకరంగా ఆడాడు. 6, 4, 4, 6, 6తో జట్టు స్కోరును 195/5కు తీసుకెళ్లాడు. పాండ్య దెబ్బకు ముంబయి ఆఖరి 4 ఓవర్లలో 60 పరుగులు సాధించింది.

Last Updated : Oct 26, 2020, 7:14 AM IST

ABOUT THE AUTHOR

...view details