అబుదాబి వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది ముంబయి ఇండియన్స్. బెంగళూరు జట్టుపై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే.. ఐపీఎల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేం అంటున్నాడు బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి. తమ బౌలర్లు చక్కని ప్రదర్శన చేశారని అన్నాడు. కానీ.. చివరి 5 ఓవర్లలో ముంబయి తమను కట్టడి చేసిందని చెప్పాడు.
"మా జట్టుకు చివరి 5 ఓవర్లు చాలా క్లిష్టమైనవి. అంతా ఫీల్డర్ల అధీనంలోకి వెళ్లిపోయింది. ముంబయి జట్టు చక్కగా బౌలింగ్ చేసి చివరి 5 ఓవర్లలో 20 పరుగులకే మమ్మల్ని కట్టిడి చేశారు. మా బౌలర్లు చక్కగా రాణించారు. ముంబయి జట్టు బ్యాట్స్మెన్ బాగా ఆడారు. ప్రారంభంలో కొన్ని జట్లు అదరగొడతాయి. మరికొన్ని జట్లు తర్వాత బాగా ఆడుతాయి. ఐపీఎల్లో ఏ జట్టు అద్భుతంగా రాణిస్తుందో, ఏది వెనుకబడిపోతుందో అంచనా వేయలేం."
--- విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్.
'ఫినిషింగ్ చేస్తా'
74 పరుగులతో సూర్యకుమార్ యాదవ్ ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. తనకు ఫినిషింగ్ చేయడం అంటేనే ఇష్టం అంటున్నాడు సూర్యకుమార్. లాక్డౌన్ కాలంలో తన ఆటతీరుపై అవగాహనకు వచ్చినట్లు చెప్పాడు.
"నేను ఆటను ఫినిషింగ్ చేయాలని అనుకుంటున్నాను. ధ్యానం చేయడం నాకు చాలా సాయపడింది. లాక్డౌన్ కాలంలో నా ఆటతీరును తెలుసుకున్నాను. తగినట్టుగా మెరుగుపరుచుకున్నాను. ఈ మ్యాచును ముగించడం సంతోషంగా ఉంది."