ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబయి అదరగొట్టింది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరును అయిదు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఈ విజయంతో 13వ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (74) అర్ధశతకం సాధించాడు. ఆ జట్టును బుమ్రా (3/14) దెబ్బతీశాడు. అనంతరం బరిలోకి దిగిన ముంబయి 19.1 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ (79*) అజేయ అర్ధశతకంతో విజృంభించాడు.
ఛేదనకు దిగిన ముంబయికి గొప్ప ఆరంభమేమి లభించలేదు. డికాక్ (18)ను సిరాజ్ ఔట్ చేయడం వల్ల 37 పరుగులకు తొలివికెట్ కోల్పోయింది. కొద్దిసేపటికే ఇషాన్ కిషన్ (25), సౌరభ్ తివారి (5) వెనుదిరిగారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కృనాల్ పాండ్య (10)తో కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అయితే కృనాల్‌ను చాహల్ ఔట్ చేసి ముంబయిని దెబ్బతీశాడు. వికెట్లు పడుతున్నా మరోవైపు సూర్యకుమార్ తన పోరాటం కొనసాగించాడు. రన్‌రేటు నియంత్రణలోనే ఉంచుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 29 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. అనంతరం మరింత చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. హార్దిక్ (17) 19వ ఓవర్‌లో వెనుదిరిగాడు. బెంగళూరు బౌలర్లలో చాహల్, సిరాజ్ చెరో రెండు వికెట్లు, మోరిస్ ఒక వికెట్ తీశాడు. స్టెయిన్ (4-0-43-0) విఫలమయ్యాడు.