కోల్‌కతా నైట్‌రైడర్స్.. 2012, 2014 సీజన్లలో విజేతగా నిలిచి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత అంచనాల్ని అందుకోవడంలో విఫలమవుతూ వచ్చింది. గతేడాది దినేశ్ కార్తీక్ సారథ్యంలో బరిలో దిగిన ఈ జట్టు ఐదో స్థానంతో సరిపెట్టుకుని ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. కానీ ఈసారి వేలంలో ప్యాట్ కమిన్స్‌ను రికార్డు ధరకు కొనుగోలు చేసిన ఈ జట్టు అతడిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై జట్టుపై పరాజయాన్ని మూటగట్టుకున్న ముంబయి ఇండియన్స్‌తో నేడు తలపడనుంది కేకేఆర్. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాలు, బలహీనతలు ఏంటి? జట్టులోని కీలక ఆటగాళ్లు ఎవరు? అనే విషయాలు తెలుసుకుందాం.
ఆల్‌రౌండర్లే కోల్‌కతా బలం
సునీల్ నరేన్, ఆండ్రూ రసెల్.. వీరిద్దరూ ఐపీఎల్లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరి వల్ల జట్టులో సమతుల్యం ఏర్పడి బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ బలంగా మారుతుంది. తాజాగా జరిగిన కరీబియన్ లీగ్‌లోనూ సత్తాచాటాడు నరేన్. రసెల్ గత సీజన్లో జట్టుకు కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఒక ఓవర్‌తోనే మ్యాచ్ గమనాన్నే మార్చే సామర్థ్యం ఇతడి సొంతం. వీరి తర్వాత ఆప్షన్ క్రిస్ గ్రీన్, ఈసారి వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ప్యాట్ కమిన్స్ రూపంలో మరో ఇద్దరు ఆల్‌రౌండర్లు జట్టుకు దొరికారు. భారత యువ ఆటగాడు కమలేశ్ నాగర్కోటి కూడా రాణిస్తే జట్టుకు తిరుగుండదు.
పసలేని బ్యాటింగ్ లైనప్
జట్టులో నాణ్యమైన విదేశీ ఆటగాళ్లు కనిపిస్తున్నా బ్యాటింగ్ లైనప్ మాత్రం కాస్త బలహీనంగా ఉంది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫినిషర్ పాత్ర పోషిస్తున్నా.. ఇతడి తర్వాత శుభ్‌మన్ గిల్, నితీశ్ రానా మాత్రమే చెప్పుకోదగ్గ ఆటగాళ్లుగా కనిపిస్తున్నారు. క్రిస్ లిన్, రాబిన్ ఉతప్పను వదులుకున్న ఫ్రాంచైజీ ఇపుడు గిల్, రానాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. రింకూ సింగ్, సిద్దేశ్ లాడ్, రాహుల్ త్రిపాఠి, నిఖిల్ నాయక్ రూపంలో ఆప్షన్స్ కనిపిస్తున్నా వీరికి ఐపీఎల్ అనుభవం తక్కువే.