ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 బౌలర్లలో దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కగిసో రబాడా ఒకడని ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు రబాడా. దీంతో లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
"కగిసో రబాడాకు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 బౌలర్లలో రబాడా ఒకరు. ఆర్సీబీని 137 పరుగులకే కట్టడి చేయడం ఆనందంగా ఉంది. తర్వాతి మ్యాచ్ రాజస్థాన్‌తో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం."
- పాంటింగ్, దిల్లీ క్యాపిటల్స్ కోచ్
ఐపీఎల్లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై 59 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. దిల్లీ బౌలర్ రబాడా నాలుగు వికెట్లు సాధించి జట్టుకు గెలుపు అందిచండంలో ప్రధానపాత్ర పోషించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. దిల్లీ బ్యాట్స్‌మెన్ పృథ్వీషా(42), శిఖర్ ధావన్ (32), పంత్(37)తో పాటు మార్కస్ స్టాయినిస్ 26 బంతుల్లో 53 పరుగులు చేసి 197 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముందుంచారు. ఛేదనకు దిగిన బెంగళూరు.. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 9 వికెట్లు కోల్పోయి 137 రన్స్ చేసింది.
పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆగ్రస్థానంలో ఉన్న దిల్లీ క్యాపిటల్స్ జట్టు అక్టోబరు 9న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.