క్రికెట్లో జోఫ్రా ఆర్చర్‌ను నోస్ట్రాడామస్‌గా పిలుస్తుంటారు. అతడు భవిష్యత్తులో జరిగే విషయాలను ముందుగానే ఊహించి ట్వీట్లు చేస్తుంటాడని అంటారు. యాదృచ్ఛికంగా అవి నిజమే అన్నట్టుగా ఉంటాయి. తాజాగా క్రిస్‌గేల్‌ను 99 పరుగుల వద్ద ఔట్ చేస్తానని అతడికి ముందే తెలుసని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2013లో అతడు చేసిన ట్వీటును విపరీతంగా షేర్ చేస్తున్నారు నెటిజన్లు.
అబుదాబి వేదికగా శుక్రవారం రాత్రి పంజాబ్, రాజస్థాన్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 185 పరుగులు చేసింది. ఆ జట్టులో క్రిస్‌గేల్ విధ్వంసకరంగా ఆడాడు. 8 సిక్సర్లు, 6 బౌండరీల సాయంతో 63 బంతుల్లోనే 99 పరుగులు చేశాడు. మైదానంలో బంతిని పరుగులు పెట్టించాడు. ఆర్చర్ వేసిన 19.3వ బంతిని సిక్సర్‌గా మలిచిన గేల్ 99 పరుగులకు చేరుకున్నాడు. మరో పరుగు చేస్తే శతకం. అలాంటింది ఆ తర్వాత బంతికే గేల్‌ను బౌల్డ్ చేశాడు ఆర్చర్. ఆవేశంలో బ్యాటు విసిరేసిన గేల్ ఆ తర్వాత ఆర్చర్‌తో చేయికలిపి పెవిలియన్ చేరాడు.