పాయింట్ల పట్టికలో తొలి, చివరి స్థానాల్లో ఉన్న జట్ల మధ్య నేడు (ఆదివారం) మ్యాచ్ జరగనుంది. ముంబయి ఇండియన్స్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రోహిత్ బృందం ఫ్లే ఆఫ్‌లో చోటు ఖరారు చేసుకున్న మొదటి జట్టుగా నిలుస్తుంది. పంజాబ్ ఓడితే రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అప్రతిష్ఠ మూట గట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఇరుజట్ల బలాలు బలహీనతలపై ఓ లుక్కేద్దాం.
ముంబయి-పంజాబ్ మ్యాచ్‌లోని దృశ్యం ముంబయి ఇండియన్స్
సమష్టి కృషితో వరుసగా ఐదు విజయాలు నమోదు చేసిన ముంబయి.. అదే దూకుడు కొనసాగించాలని చూస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(251 పరుగులు), డికాక్(269)తో పాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్(243), ఇషాన్ కిషన్(186) ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.
బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్.. ఈ సీజన్లో విజయవంతమైన జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి 8 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్ రాహుల్ చాహర్ కూడా గత మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
ఈ సీజన్లో ఎక్కువ పరుగులు చేసిన వారిలో పంజాబ్ జట్టులోని కేఎల్ రాహుల్(387), మయాంక్ అగర్వాల్(337) ముందున్నారు. అయినా మిగిలిన వారి నుంచి సహకారం లేకపోవడం, అదృష్టం కలిసి రాకపోవడం వల్ల మ్యాచ్‌లు ఓడిపోతున్నారు. గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన గేల్.. తన బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్నందించాడు.
అయితే ఇప్పటికే ఫ్లే ఆఫ్ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్న పంజాబ్‌కు, ఈ మ్యాచ్‌లో గెలుపు చాలా కీలకం. బౌలింగ్‌లోనూ షమీ, రవి బిష్ణోయ్ మినహా మిగిలిన వారందరూ సరిగా ఆడలేకపోతున్నారు. దీంతో పంజాబ్ మ్యాచ్‌లు ఓడిపోవాల్సి వస్తోంది.
జట్లు(అంచనా)
ముంబయి: రోహిత్ శర్మ(కెప్టెన్), డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, కృనాల్ పాండ్యా, కౌల్టర్ నీల్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా
పంజాబ్: క్రిస్ గేల్, కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పూరన్, మ్యాక్స్‌వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్