ఈ ఐపీఎల్‌ను కోల్‌కతాకు ఓటమితో ప్రారంభించింది. స్టార్ బ్యాట్స్‌మెన్ జట్టులో ఉన్నప్పటికీ.. ముంబయి ధాటికి తలవంచక తప్పలేదు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్.. బెంగళూరు చేతిలో ఓడి ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ రెండు జట్లు శనివారం జరిగే మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ సారైనా తమ లోపాలను సరిదిద్దుకుని గెలవాలని పట్టుదలగా బరిలో దిగుతున్నాయి. పాయింట్ల పట్టికలో బోణీ కొట్టాలని ఉత్సాహం చూపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాలు, బలహీనతలపై కథనం.
కోల్‌కతా నైట్‌రైడర్స్
ముంబయితో మ్యాచ్‌లో రసెల్, మోర్గాన్, నరైన్ లాంటి స్టార్స్ ఉండటం వల్ల కోల్‌కతా విజయం సాధిస్తుందని అభిమానులంతా భావించారు. కెప్టెన్ దినేశ్ కార్తిక్.. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా నిర్ణయాలు తీసుకోవడంలో తడబడినట్లు కనిపిస్తోంది. ఫలితంగా ముంబయిపై 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సారైనా సరైన వ్యూహాలతో హైదరాబాద్‌ను ఓడిస్తుందేమో చూడాలి.
సన్‌రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్‌లోని బలమైన ఫ్రాంచైజీల్లో హైదరాబాద్ ఒకటి. గత మ్యాచ్‌లో బౌలింగ్‌లో అదరగొట్టిన వార్నర్ బృందం.. ఛేదనలో బెంగళూరుతో చివరి వరకు పోరాడి 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గత మ్యాచ్‌లో రనౌట్ అయిన కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ఈసారి మాత్రం అత్యుత్తమ ప్రదర్శన చేసి, పాయింట్ల పట్టికలో బోణీ కొట్టాలని చూస్తున్నాడు. గాయపడిన మిచెల్ మార్ష్ బదులుగా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను తీసుకున్నారు. మరోవైపు రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ లాంటి స్టార్ బౌలర్లతో టీమ్ బలంగా ఉంది. శనివారం మ్యాచ్‌లో ఎలా చెలరేగుతుందో చూడాలి?