ముంబయి ఇండియన్స్ జట్టు ఓపెనర్‌గా ఆడాలనేది తన కోరిక అని అన్నాడు ఆ జట్టు బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్. యాజమాన్యం అవకాశమిస్తే తొలిస్థానంలో బ్యాటింగ్ చేస్తానని తెలిపాడు. కోల్‌కతాతో మ్యాచ్ అనంతరం జరిగిన వర్చువల్ ఇంటర్వ్యూలో ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతారని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చాడు.
"ఇది యాజమాన్యం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. గతంలో ఆడిన విధంగానే ముంబయి ఇండియన్స్ ఓపెనర్‌గా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నా. ఒకవేళ నాకు ఆ అవకాశం వస్తే చాలా సంతోషిస్తా."
- సూర్యకూమార్ యాదవ్, ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మన్
కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబయి ఇండియన్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు సూర్యకుమార్. మూడోస్థానంలో బ్యాటింగ్‌కు దిగి 28 బంతుల్లో 47 (6 ఫోర్లు, ఒక సిక్సర్) రన్స్ చేశాడు.
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించాడు. "రోహిత్ శర్మ ప్రపంచస్థాయి బ్యాట్స్‌మన్. వాంఖడే స్టేడియంలో ఎలా బ్యాటింగ్ చేస్తాడో.. అబుదాబిలోనూ అలాంటి ప్రదర్శనే చేశాడు. ఇక్కడ బౌండరీలు పెద్దవైనా.. అతడి బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పు రాలేదు. రోహిత్ శర్మ చాలా సహజంగా ఆడతాడు. ఆ ఆటతీరును మీరే ప్రత్యక్షంగా చూస్తున్నారు" అని తెలిపాడు.
ముంబయి ఇండియన్స్.. ఐపీఎల్‌లోని తమ తర్వాతి మ్యాచ్‌ను సెప్టెంబరు 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.