వేసవి ఎప్పట్లాగే ఈసారీ వచ్చింది. వెళ్లిపోయింది! కానీ ఎప్పట్లా సిక్సర్లూ, సెంచరీలూ లేవు.. వికెట్లూ, సూపర్ ఓవర్లూ లేవు! ఈ రోజు రాత్రికి గెలిచేదెవరిని చర్చ లేదు. నిన్నటి మ్యాచ్ గురించి విశ్లేషణ లేదు! పాయింట్ల పట్టిక ఊసు లేదు.. ప్లేఆఫ్ బెర్తుల గురించి ఉత్కంఠ లేదు! ఇటు టీవీలు మూగబోయాయి.. అటు మైదానాలు బోసిపోయాయి! ఆటగాళ్లు, అభిమానులు, వ్యాఖ్యాతలు.. ఇలా అందరూ ఇళ్లకే పరిమితం! పుష్కర కాలంగా అలవాటు పడ్డ వినోదం లేక అందరిలోనూ నిస్తేజం! కానీ ఈసారికి ఇంతే అని నిట్టూర్చిన వేళ.. ఆలస్యంగా అయినా సరే, ఐపీఎల్ ఉందన్న కబురుతో ఎక్కడ లేని ఉత్సాహం! అయితే ఈసారి ఐపీఎల్ జరిగేది మన వేదికల్లో కాదు.. స్టాండ్స్‌లో వీక్షకులూ కనిపించరు.. అభిమానులందరూ టీవీల ముందే.. వ్యాఖ్యాతలు ఎక్కడెక్కడో.. కరోనా వేళ.. ఎన్నో భయాలు, షరతుల మధ్య జరగబోతోంది ఆట! ఈ ప్రతికూలతలు ఎన్నుంటే ఏం.. ఎలాగోలా ఐపీఎల్ అయితే జరగబోతోంది. ఫేవరెట్ క్రికెట్ స్టార్లందరినీ మళ్లీ చూడబోతున్నాం. ఏ అడ్డంకీ లేకుండా ఆట సాగిపోతే అదే చాలన్నది అందరి ఆకాంక్ష! విరామం తర్వాత వినోదానికి సిద్ధమా మరి!
కరోనా మహమ్మారి ధాటికి అనివార్య పరిస్థితుల్లో వాయిదా పడ్డ ఐపీఎల్ 13వ సీజన్.. ఎట్టకేలకు నేడు ఆరంభం కాబోతోంది. దేశంలో వైరస్ విజృంభణ తగ్గకపోవడం వల్ల యూఏఈకి తరలిన లీగ్.. అక్కడి మూడు వేదికల్లో (దుబాయ్, అబుదాబి, షార్జా) 50 రోజుల పాటు సందడి చేయబోతోంది. కరోనా నేపథ్యంలో గత రెండు నెలల్లో జరిగిన అంతర్జాతీయ సిరీస్‌ల తరహాలోనే బయో బబుల్ సెక్యూర్ విధానంలో అనేక షరతుల మధ్య, ఖాళీ మైదానాల్లో అభిమానులు లేకుండా లీగ్‌ను నిర్వహించనున్నారు.
నాలుగు వారాల కిందటే యూఏఈకి చేరుకుని, క్వారంటైన్ పూర్తి చేసుకుని.. రెండు వారాల పాటు ప్రాక్టీస్ చేసిన ఎనిమిది జట్లు ఇక అసలు ఆటకు సిద్ధమయ్యాయి. శనివారం రాత్రి 7.30కు ఆరంభమయ్యే తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయిని రన్నరప్ చెన్నై సూపర్‌కింగ్స్ ఢీకొంటోంది. లీగ్ చరిత్రలో అత్యుత్తమ జట్ల మధ్య పోరుతో ఐపీఎల్‌కు రసవత్తర ఆరంభం లభిస్తుందన్నది అందరి ఆకాంక్ష.
జట్లన్నీ యూఏఈకి చేరుకున్న కొన్ని రోజులకే చెన్నై శిబిరంలోకి ప్రవేశించి అందరినీ ఆందోళనకు గురి చేసిన కరోనా.. టోర్నీ మధ్యలో అతిథిగా రావొద్దన్నది అందరి కోరిక. ఈ మహమ్మారికి ఎదురు నిలిచి, పోటాపోటీ ఆటతో అభిమానుల అంచనాలకు తగ్గని విధంగా లీగ్‌ను జరిపించగలిగితే క్రికెట్ ప్రపంచానికి అది గొప్ప ఊరట అవుతుందనడంలో సందేహం లేదు.
వేడి బాబోయ్..
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి దేశాల నుంచి ఐపీఎల్ కోసం భారత్‌కు వచ్చే ఆటగాళ్లు.. మన వాతావరణానికే అల్లాడిపోతుంటారు. మరి ఇప్పుడు ఐపీఎల్ జరగబోయేది యూఏఈలో. అక్కడ రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు 35-40 డిగ్రీల మధ్య ఉంటాయి. రాత్రి పది గంటలకు కూడా వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నుట్లు దక్షిణాఫ్రికా స్టార్ డివిలియర్స్ తాజాగా వాపోయాడు. మధ్యాహ్నం మ్యాచ్‌లు తక్కువే అయినా.. అవి సవాలు విసురుతాయి. రాత్రి మ్యాచ్‌ల్లోనూ ఉక్కపోతతో ఆటగాళ్లు ఇబ్బంది పడటం, విపరీతంగా చెమటలు కారి అలసిపోవడం ఖాయం. ఇది ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపొచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిందే.
అరగంట ముందే..
ఐపీఎల్‌లో సాయంత్రం మ్యాచ్‌లు 4 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 8 గంటలకు మొదలవడం ఆనవాయితీ. అయితే యూఏఈ ఆతిథ్యమివ్వనున్న ఈ సీజన్లో మ్యాచ్‌ల వేళలు మారాయి. సాయంత్రం మ్యాచ్‌లు 3.30కే ఆరంభం కానుండగా.. జరిగే రాత్రి మ్యాచ్‌లు 7.30కి మొదలవుతాయి. అయితే మొత్తం 60 మ్యాచ్‌ల్లో 3.30కి మొదలయ్యే మ్యాచ్‌లు పది మాత్రమే. ఐపీఎల్‌ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది.
అతడి గ్లోవ్స్ ఎవరివి?
పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోనీ వారసుడెవరు అనే ప్రశ్నకు టీమ్‌ఇండియా ఇంకా సమాధానం కనుక్కోలేదు. ధోనీ ఉండగానే, కొన్నేళ్ల ముందు నుంచే ఈ దిశగా ప్రయత్నాలు మొదలైనా ఫలితం లేకపోయింది. ఇప్పుడు మహీ నిష్క్రమించాడు. ఇక ఆ స్థానాన్ని సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాల్సిందే. ఆరంభంలో ఆశలు రేపి, ఆ తర్వాత అవకాశాల్ని వృథా చేసిన రిషబ్ పంత్.. దక్కిన కొన్ని అవకాశాల్ని ఉపయోగించుకోని సంజూ శాంసన్.. తాత్కాలిక పరిష్కారంలా కనిపిస్తున్న కేఎల్ రాహుల్.. ఈ ముగ్గురూ టీమ్‌ఇండియాలో ధోనీ గ్లోవ్స్‌ను తొడుక్కోవడానికి పోటీ పడుతున్నారు. ఈ ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగా ఆ గ్లోవ్స్ ఎవరివన్నది తేలుతుంది.