తెలంగాణ

telangana

ఐపీఎల్: ముద్దులు మిస్సయ్యాయ్‌..బిగ్గరగా గర్జిస్తాం!

By

Published : Oct 28, 2020, 7:55 PM IST

ఐపీఎల్​లో ఇప్పటికే 47 లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాయి. అయినా ఇంకా ఏ జట్టు ప్లేఆఫ్‌ బెర్తుని ఖరారు చేసుకోలేదు! దీన్ని బట్టి తెలుస్తోంది.. లీగ్‌లో ఎలాంటి కఠిన పోటీ నెలకొందో. ఈ సీజన్‌ తొలి అర్ధభాగంలో గర్జించిన దిల్లీ వరుసగా హ్యాట్రిక్‌ పరాజయాలు చవిచూస్తే.. పంజాబ్‌పై 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన హైదరాబాద్‌ ఏకంగా 219 పరుగుల భారీస్కోరు చేసింది. ఇలా ఊహించని సంఘటనలతో లీగ్‌ రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలో లీగ్‌ ఆసక్తికర కబుర్లు ఒకసారి చూద్దామా!

cricket social media look
ఐపీఎల్: ముద్దులు మిస్సయ్యాయ్‌..బిగ్గరగా గర్జిస్తాం!

అబుదాబి వేదికగా ఐపీఎల్​లో నేడు ముంబయి, బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ప్లేఆఫ్‌ బెర్తు ఖరారు చేసుకుంటుంది. అయితే ఈ సీజన్‌లో ఇటీవల ముంబయి×బెంగళూరు తలపడగా సూపర్ ఓవర్‌లో కోహ్లీసేన గెలిచింది. నవదీప్‌ సైని అద్భుతంగా బౌలింగ్‌ చేసి 7 పరుగులే ఇచ్చాడు. నేడు ముంబయితో మ్యాచ్‌ సందర్భంగా ఈ విషయాన్ని బెంగళూరు గుర్తుచేస్తూ సూపర్‌ బౌలర్‌ సైని.. సూపర్‌ ఓవర్‌ వేశాడని ట్వీట్‌ చేసింది.

అలాగే తమ జట్టు ప్రదర్శనను కోచ్‌ మహేలా జయవర్ధనే, ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జహీర్‌ఖాన్‌ దగ్గరగా పరిశీలిస్తున్నట్లు ముంబయి ట్వీట్‌ చేసింది. ఇటీవల రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

దిల్లీపై ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టి విజయం సాధించిన హైదరాబాద్‌.. "కలిసి ఆడితే దరికి చేరదా విజయం" అని పోస్ట్‌ చేసింది. మరోవైపు దిల్లీ.. "మంచి సమయంలో పాటు కఠిన పరిస్థితుల్లోనూ కలిసే ఉంటాం. బలంగా పుంజుకుని బిగ్గరగా గర్జిస్తాం" అని ట్వీటింది.

తన మేనకోడలు హసీనాను ఎంతో మిస్‌ అవుతున్నట్లు హైదరాబాద్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ తెలిపాడు. తనని టీవీలో చూస్తూ ప్రేమతో హసీనా ఫ్లయింగ్‌ కిస్‌లు ఇస్తున్న వీడియోను పోస్ట్‌ చేశాడు. "నా ముద్దుల మేనకోడలు హసీనా ఫ్లెయింగ్‌ కిస్‌లు... తనని ఎంతో మిస్ అవుతున్నా" అని దానికి వ్యాఖ్య జత చేశాడు. దిల్లీపై హైదరాబాద్ విజయం సాధించడంలో రషీద్‌ కీలకపాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

ఉత్కంఠ మ్యాచ్‌లను ఆస్వాదిస్తున్న క్రికెట్‌ అభిమానులకు మరింత వినోదాన్ని పంచడానికి అమ్మాయిల టీ20 ఛాలెంజ్​ మొదలుకానుంది. షార్జా వేదికగా నవంబర్‌ 4న తొలి మ్యాచ్‌లో వెలాసిటి, ట్రయల్‌బ్లేజర్స్‌ తలపడనున్నాయి. ఈ మేరకు ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కరోనా కారణంగా భారత మహిళా క్రికెటర్లు దాదాపు ఆరు నెలల తర్వాత మైదానంలో అడుగుపెట్టారు.

ABOUT THE AUTHOR

...view details