దిల్లీతో సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 39 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఆలౌటైంది. వార్నర్(51), బెయిర్‌స్టో(41) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రబాడ నాలుగు వికెట్లతో విజృంభించగా... కీమో పాల్, మోరిస్‌లు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. కీమో పాల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రైజర్స్‌కు ఇది హ్యాట్రిక్ ఓటమి.
156 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌కు మంచి ఆరంభం దక్కినా... సద్వినియోగ పరచుకోలేకపోయింది. బెయిర్ స్టో- వార్నర్ తొలి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దిల్లీ బౌలర్ కీమో పాల్ 9వ ఓవర్లో బెయిర్ స్టోను వెనక్కి పంపగా.. కొద్దిసేపటికే విలియమ్స్న్నీ ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. వార్నర్ నిలకడగా ఆడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రబాడా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 16 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ జట్టు.