ఐపీఎల్ 12వ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ అయినా గెలవని రెండు జట్లు విజయంపై కన్నేశాయి. జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. వరుస ఓటములతో నిరాశలో ఉన్న ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో గెలుపు చాలా అవసరం.
- ప్రతి మ్యాచ్‌లోనూ గెలిచే స్థితి నుంచి ఓటమి చవిచూసింది రాజస్థాన్ రాయల్స్. వచ్చిన అవకాశాలను సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయింది. వరుసగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగులకే మూడు వికెట్లు తీసిన రాజస్థాన్.. తర్వాత ఆటపై పట్టు కోల్పోయింది. ధోని కీలక ఇన్నింగ్స్‌తో మ్యాచ్ చెన్నై చేతుల్లోకి వెళ్లిపోయింది.
"ఓడినా, గెలిచినా అది జట్టుకే చెందుతుంది. మూడు మ్యాచుల్లోనూ మేము చాలా బాగా ఆడాం. కానీ అదృష్టం కలిసిరాలేదు".
-- అజింక్య రహానే, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్
స్మిత్, స్టోక్స్ లాంటి ఆటగాళ్లున్నా రాజస్థాన్ అంచనాలను అందుకోలేకపోతుంది. ఐపీఎల్ 12వ సీజన్లో మొదటి సెంచరీ చేసిన సంజు శాంసన్.. ఓపెనర్లు బట్లర్, రహానే మంచి ప్రతిభ కనబరుస్తుండగా చెన్నైతో మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి ఆకట్టుకున్నాడు. స్మిత్, స్టోక్స్ ఫామ్‌లోకి రావల్సి ఉంది.
- మరోవైపు బెంగళూరు జట్టుది అదే పరిస్థితి. వరుసగా మూడు మ్యాచుల్లోనూ ఓడి విమర్శలు ఎదుర్కొంటోంది. మొదటి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఘోర పరాజయం. ముంబయితో జరిగిన ఉత్కంఠ పోరులో ఓటమి చవిచూసింది. సన్ రైజర్స్‌తో మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్.... రెండు విభాగాల్లోనూ విఫలమై మరో ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది.