ముంబయి వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. పొలార్డ్ విజృంభించిన వేళ కింగ్స్ ఎలెవన్ నిర్ధేశించిన 198 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. రసవత్తరంగా సాగిన పోరులో నిర్ధేశిత లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ మూడు వికెట్ల తేడాతో చేధించింది. పాయింట్ల పట్టికలో రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకుంది.
పోలార్డ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. పంజాబ్ బౌలర్లలో షమి 3 వికెట్లు, రాజ్పుట్, అశ్విన్, సామ్ కరన్‌లు ఒక్కో వికెట్ పడగొట్టారు.
చివరి ఓవర్లో ఉత్కంఠ...
చివరి ఓవర్లో ముంబయి ఇండియన్స్ 15 పరుగులు చేయాల్సి ఉండగా పంజాబ్ సారథి అశ్విన్ బంతిని రాజ్‌పుట్‌కు ఇచ్చాడు. తొలి బంతిని రాజ్పుట్ నోబాల్ వేశాడు. దాన్ని పొలార్డ్ సిక్స్‌గా మలిచాడు. ఒత్తడిలో రాజ్పుట్ వేసిన ఫ్రీ హిట్‌కు పొలార్డ్ ఫోర్ బాదాడు. దీంతో 5 బంతుల్లో కావల్సింది 4 పరుగులే. ఇక గెలుపు ముంబయి సొంతం అనుకున్న సమయంలో రాజ్పుట్ వేసిన రెండో బంతికి పొలార్డ్ భారీ షార్ట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. ఒక్క సారిగా స్టేడియం నిశబ్ధమైంది. టెయిలెండర్లే మిగిలుండటం వల్ల ముంబయి ఇండియన్స్ గెలుపుపై అనుమానాలు పెరిగాయి. మూడో బంతి ఎదుర్కొన్న జోసెఫ్, రాజ్పుట్ వేసిన ఫుల్‌టాస్‌కు పరుగులు సాధించలేకపోయాడు. నాలుగో బంతిలో సింగిల్ రాబట్టాడు. 2 బంతుల్లో 3 పరుగులు కొట్టాలి. ఐదో బంతికి రాహుల్ చాహర్ సింగల్ తీశాడు. దీంతో సూపర్ ఓవర్‌పై అంచనాలు పెరిగాయి. కానీ చివరి బంతికి జోసెఫ్ రెండు పరుగులు చేసి ముంబయికి విజయం అందించాడు.
పొ'లార్డ్'...