ఐపీఎల్ మజా తెలియాలంటే గురువారం జరిగిన చెన్నై-రాజస్థాన్ తరహా మ్యాచ్‌ను చూడాల్సిందే. చివరి వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో విజయం చెన్నైనే వరించింది. సొంతగడ్డపై గెలవాలకున్న రాజస్థాన్‌కు భంగపాటే ఎదురైంది. ఛేదనలో రాయుడు, ధోని అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ఈ గెలుపుతో ఐపీఎల్లో వంద విజయాలు అందుకున్న కెప్టెన్‌గా రికార్డు సాధించిన ధోనీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డునూ అందుకున్నాడు.
జైపుర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది చెన్నై. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ధోనీసేనకు శుభారంభం దక్కలేదు. ఖాతా తెరవక ముందే వాట్సన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. మిగతా బ్యాట్స్‌మెన్ రైనా, డుప్లెసిస్, కేదార్ జాదవ్ వెంట వెంటనే వెనుదిరిగారు. 24 పరుగులకే నాలుగు వికెట్లు పోగొట్టుకుని కష్టాల్లో పడింది చెన్నై జట్టు.
ధోనీ-రాయుడు జోడీ..
ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన ధోనీ, రాయుడు వికెట్ల పతనాన్ని అడ్డుకుని నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నిర్మించారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఐదో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ క్రమంలో అర్ధ సెంచరీ చేసిన రాయుడు... 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.