ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓ దశలో భారత్ స్కోరు 97/0. ప్రత్యర్థిని 183 పరుగులకే కట్టడి చేశాక.. భారత్‌కు దక్కిన ఆరంభమిది. ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్ ప్రారంభ పోరులో భారత్‌కు ఇంతకంటే ఆరంభం ఏముంటుంది? కానీ ఇంకో రెండు గంటల ఆట గడిచేసరికి భారత్ స్కోరు 145/5. చేతుల్లోకి వచ్చేసినట్లుగా కనిపించిన మ్యాచ్‌పై ఉన్నట్లుండి భారత్ పట్టు కోల్పోవడానికి కారణం.. 3, 4, 5 స్థానాల్లోని పుజారా, కోహ్లీ, రహానెల ఘోర వైఫల్యం! ముగ్గురిలో ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేదు ఆ ఇన్నింగ్స్‌లో. లోయరార్డర్ పోరాటంతో భారత్ మళ్లీ పుంజుకుని మ్యాచ్‌లో పైచేయి సాధించింది, విజయావకాశాలు కల్పించుకుంది కానీ.. లేదంటే ఆ మ్యాచ్‌లో వెనుకబడిపోయేది, ఓటమి ముప్పును ఎదుర్కొనేది. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ముందు 209 పరుగుల లక్ష్యం నిలవగా.. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 52/1తో నిలిచింది. చివరి రోజు ఆట కొనసాగితే భారత్ గెలిచేదని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే కోహ్లీ, పుజారా, రహానెల ఫామ్ అలా ఉంది. ప్రసుత్త రెండో టెస్టు విషయానికే వస్తే.. ఈ ముగ్గురి వైఫల్యం మరోసారి భారత్‌ను దెబ్బ తీసింది. ఓపెనర్లిద్దరూ కలిసి 200 పైచిలుకు పరుగులు చేస్తే.. చివరికి భారత్ 364 పరుగులతో సరిపెట్టుకుంది. కోహ్లీ కష్టం మీద 42 పరుగులు చేస్తే.. పుజారా (9), రహానె (1) రెండంకెల స్కోరునే అందుకోలేదు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో వీరి వైఫల్యం ఆందోళన రేకెత్తించేదే.
ముగ్గురిదీ అదే బలహీనత:ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చినపుడల్లా భారత బ్యాట్స్‌మెన్‌ను ఆఫ్‌సైడ్ ఆవల స్వింగ్ బంతులతో ఆటాడుకోవడం అండర్సన్‌కు అలవాటే. 2014లో విరాట్‌ను ఆ బంతులతోనే బోల్తాకొట్టించాడు జిమ్మీ. అయితే 2018లో ఆ బలహీనతను అధిగమించి పరుగుల వరద పారించాడు భారత కెప్టెన్. కానీ ఇప్పుడు మళ్లీ పాత సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. తొలి టెస్టులో అండర్సన్, రెండో టెస్టులో ఓలీ రాబిన్సన్ ఆఫ్ సైడ్ ఆవల ఊరించేలా బంతులేసి కోహ్లీని బుట్టలో వేశారు. రెండుసార్లూ బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్‌లోకి వెళ్లింది. పుజారా, రహానెలది కూడా ఇదే సమస్య. ఆఫ్ సైడ్ స్వింగ్ బంతులకు వికెట్లిచ్చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లు ఎలా దాడి చేస్తారో తెలిసీ, ఇక్కడి పరిస్థితుల్లో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండీ ఈ ముగ్గురూ ఇలా ఔటవడం ఆందోళనకరం. టీ20లకు పేరుపడ్డ రాహుల్.. చాన్నాళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ గొప్ప సహనంతో బ్యాటింగ్ చేసి ఇంగ్లీష్ బౌలర్లను సతాయించాడు. రోహిత్ కూడా గొప్ప సహనం, పరిణతితో బ్యాటింగ్ చేశాడు. కానీ వీరి కంటే టెస్టుల్లో ఎక్కువ అనుభవం, ఘనమైన రికార్డు ఉన్న ముగ్గురూ వరుసగా విఫలమవుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ సిరీస్ అనే కాదు.. రెండేళ్లుగా ఈ ముగ్గురి ప్రదర్శనా ఆశాజనకంగా లేదు. కోహ్లీ సెంచరీ చేసి 21 నెలలు దాటిపోయింది. టెస్టులనే కాదు.. ఏ ఫార్మాట్లోనూ ఈ కాలంలో సెంచరీ చేయలేదతను. అడపా దడపా 50+ స్కోర్లు చేస్తున్నా.. పెద్ద ఇన్నింగ్స్ మాత్రం ఆడట్లేదు.