తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టార్ పేసర్ రేణుకా సింగ్‌కు ICC అవార్డ్​.. క్రికెట్​లోకి వచ్చి ఏడాది కాకముందే..

భారత జట్టు వెటరన్ పేసర్ జులన్ గోస్వామి రిటైర్మెంట్​ తర్వాత ఆమె వారసురాలిగా జట్టులోకి వచ్చిన రేణుకా సింగ్.. అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ టీమ్​ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఆమెకు ఐసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్​ అవార్డు వరించింది.

indian-star-pacer-renuka-singh-wins-icc-emerging-women-s-cricketer-of-the-year-2022
indian-star-pacer-renuka-singh-wins-icc-emerging-women-s-cricketer-of-the-year-2022

By

Published : Jan 25, 2023, 6:52 PM IST

క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చి ఇంకా ఏడాది కూడా కాకముందే టీమ్​ఇండియా యువ పేసర్ రేణుకా సింగ్​కు అవార్డులు క్యూ కడుతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో భారత జట్టులోకి వచ్చిన ఈ హిమాచల్​ప్రదేశ్ అమ్మాయి.. 2022కు గాను ఐసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ మేరకు ఐసీసీ బుధవారం ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ అవార్డు రేసులో ఆస్ట్రేలియాకు చెందిన డార్సీ బ్రౌన్, ఇంగ్లాండ్ క్రీడాకారిణి అలైస్ క్యాప్సీలతో పాటు తన సహచర క్రికెటర్ యష్తిక భాటియాలు పోటీలో ఉన్నా.. రేణుకాసింగ్​కే ఈ అవార్డు వరించింది. ఏడాదికాలంగా వన్డేలతో పాటు టీ20ల్లో భారత్ సాధించిన విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్న రేణుకకు ఈ అవార్డు దక్కింది. గతేడాది ఫిబ్రవరి 18న న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన రేణుక.. ఇప్పటివరకు 21 వన్డేల్లో 22 వికెట్లు తీసింది. 29 మ్యాచ్​ల్లోనే 40 వికెట్లు సాధించింది.

గతేడాది కామన్వెల్త్ గేమ్స్​లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో రేణుక వేసిన స్పెల్ ఓ సంచలనం. నాలుగు ఓవర్లు వేసిన ఆమె నలుగురు ఆసీస్ బ్యాటర్లను ఔట్ చేసి ఆ జట్టుకు భారీ షాకిచ్చింది. ఇన్ స్వింగర్ ఆమె ఆయుధం. బ్యాటర్లను తికమకపెట్టి లోపలికి దూసుకొచ్చే బంతి వికెట్లను గిరాటేయడం ఆమె ప్రత్యేకత. మేటి క్రికెటర్లను కూడా దాటుకుని ఐసీసీ అవార్డు స్వీకరించడంపై ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details