తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ అమ్మాయి 'మ్యాన్‌' ఆఫ్‌ ద సిరీస్‌.. సచిన్​ను చూసి బ్యాట్ పట్టి..

ఆడపిల్లలు వద్దనుకునే రాష్ట్రంలో పుట్టిందా అమ్మాయి. ఎనిమిదేళ్ళు దాటగానే వారిని ఆంక్షల చట్రంలో బంధించే ఖాప్‌ పంచాయతీల నడుమ పెరిగింది. అందుకే, అబ్బాయిలా డ్రెస్‌ చేసుకుని క్రికెట్‌ కోచింగ్‌కి వెళ్ళింది. ఆర్థిక ఇబ్బందుల నడుమ నలిగిపోతూనే- అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. రికార్డుల మోతమోగించడం రివాజుగా మార్చుకుంది. ఆ ఊపులోనే కెప్టెన్‌గా ఇటీవల దేశానికి తొలి అండర్‌-19 మహిళా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ని సాధించిపెట్టింది.. షెఫాలీ వర్మ. తన కెరీర్‌ ఇన్నింగ్స్‌లోని కొన్ని హైలైట్స్‌ ఇవి..

Indian cricketer Shafali Verma Special story
Shafali Verma

By

Published : Feb 12, 2023, 8:00 AM IST

అది 2013వ సంవత్సరం. హరియాణాలోని లాహ్లి ప్రాంతంలో.. చౌధురి బన్సీలాల్‌ స్టేడియం. హరియాణా-ముంబయి జట్ల మధ్య రంజీ మ్యాచ్‌ జరుగుతోంది. ఎటుచూసినా ఇసుకవేస్తే రాలనంత జనం. ఆ జనంలో ఒకరిగా నిల్చుని ఉన్నాడు సంజీవ్‌ వర్మ. ఆయన భుజంపైన ఎక్కి మరీ ఆ మ్యాచ్‌ చూస్తోంది తొమ్మిదేళ్ల షెఫాలీ. ఓ మామూలు రంజీమ్యాచ్‌కి అంత జనం.. ఆ హడావుడీ ఉండదుకానీ ఆ రోజు 'మాస్టర్‌ బ్లాస్టర్‌' సచిన్‌ తెందుల్కర్‌.. కెరీర్‌లో చిట్టచివరి రంజీ మ్యాచ్‌ ఆడుతున్నాడక్కడ.

సచిన్‌ క్రీజులోకి వచ్చినప్పటి నుంచీ వీక్షకులు చేసిన సందడి అంతాఇంతా కాదు. మ్యాచ్‌ పూర్తయి స్టేడియం నుంచి బయటకి వస్తూ ఉంటే వాళ్ళ నాన్న సంజీవ్‌ వర్మని అడిగింది- 'నాన్నా! నేనూ క్రికెటర్‌నైతే నన్నూ ఇంతగానే అభిమానిస్తారా!' అని. 'తప్పకుండా.. కాకపోతే, అందుకు నువ్వు చాలా శ్రమించాలి!' అన్నాడాయన. ఆ మాటలు షెఫాలీ మనసులో బలంగా నాటుకుపోయాయి. నాటి నుంచి అదే తన కలగా మారింది. ఆ కల తనదే కాదు.. వాళ్ళ నాన్నది కూడా..

హరియాణా రోహ్‌తక్‌ నగరంలోని ఓ స్వర్ణకారుల కుటుంబం సంజీవ్‌ వర్మది. ముగ్గురు పిల్లల్లో చివరివాడు. 1983లో 'హరియాణా హరికేన్‌' కపిల్‌ దేవ్‌ దేశానికి తొలి ప్రపంచకప్పు సాధించిపెట్టినప్పుడు.. అతను టీనేజీలో ఉన్నాడు. క్రికెటర్‌ అవ్వాలని కోచింగ్‌లోనూ చేరాడు. కానీ పోనుపోను సంజీవ్‌కి శిక్షణ ఇప్పించడం అతని కుటుంబానికి తలకుమించిన భారం కావడంతో మధ్యలోనే మానెయ్యమన్నారు. అలా సంజీవ్‌ వర్మ తన కలలన్నింటినీ కులవృత్తి కొలిమిలో కాల్చేయాల్సి వచ్చింది. రోహ్‌తక్‌ నగరంలో ఓ చిన్న నగల దుకాణం పెట్టాడు. పెళ్ళై ముగ్గురు పిల్లలు పుట్టాక.. కొడుకు సాహిల్‌ని తన క్రికెట్‌ కలలకి ప్రతిరూపంగా చూశాడు. పదేళ్ళ నుంచే అతనికి శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టాడు.

షెఫాలీ వర్మ ఫ్యామిలీ

షెఫాలీని కేవలం బంతులు ఏరడానికి పిలుచుకెళ్ళేవాడు. ఓ రోజు సాహిల్‌ అలసిపోతే.. బ్యాట్‌ని షెఫాలీ చేతికి ఇచ్చాడు. కొడుక్కి చెప్పిన బ్యాటింగ్‌ టెక్నిక్స్‌ని.. ఈ అమ్మాయి తు.చ. తప్పకుండా పాటిస్తూ బంతులని సునాయాసంగా బౌండరీలకి తరలించడం చూసి ఆశ్చర్యపోయాడు. నాటి నుంచి షెఫాలికీ క్రికెట్‌ శిక్షణ మొదలుపెట్టాడు. అందులో భాగంగా ఇద్దరి మధ్య సిక్సర్ల పోటీ పెట్టేవాడు. ఒక ఓవర్లో ఎవరు ఎక్కువ సిక్సులు కొడితే వాళ్ళకి బహుమతిగా పది రూపాయలిచ్చేవాడు. ఆ పదులతోపాటూ.. క్రమంగా తండ్రి నమ్మకాన్నీ గెలుచుకుంది షెఫాలీ. 'క్రికెట్‌లో నేను అందుకోలేని విజయాల్ని.. ఒకనాటి నా కలని షెఫాలీ నిజం చేస్తుంది' అన్న విశ్వాసం అది. తన వారసురాలిగా ఆ కలని తన కూతురికి అందించాలనే.. ఆ రోజు సచిన్‌ ఆడిన చివరి రంజీ మ్యాచ్‌కి తీసుకెళ్ళాడు. ఆయన ఆశించినట్టే అయ్యింది. ఆ రోజు నుంచి షెఫాలీ క్రికెట్‌నే ఆశగా శ్వాసగా మార్చుకుంది..

'అమ్మాయిలకి నేర్పేది లేదు'
రోజూ స్కూలు నుంచి వచ్చీరాగానే.. వాళ్ళన్నయ్య, అతని ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టింది. వాళ్లు షెఫాలీని ఎప్పుడూ 'ఎక్స్‌ట్రా ప్లేయర్‌'గానే భావించి బ్యాటింగ్‌ ఇవ్వకపోయినా.. పట్టించుకునేది కాదు. ఓసారి వాళ్ళన్నయ్య లేనప్పుడు- షెఫాలీ ఉత్సాహంగా ఫీల్డింగ్‌ చేస్తుంటే 'నువ్వు క్రికెట్‌కి పనికిరావు.. బంతి ఎత్తుకెళ్ళే దొంగలా ఉన్నావు' అంటూ వెక్కిరించారు. ఆ విషయం తండ్రితో చెబితే ఆ తర్వాతి రోజే షెఫాలీని తీసుకుని ఓ కోచింగ్‌ సెంటర్‌కి వెళ్ళాడు సంజీవ్‌. వాళ్ళు 'అమ్మాయిలకి మేం శిక్షణ ఇవ్వం' అనేశారు. మిగతా అకాడమీలకి ఫోన్‌ చేసినా అదే జవాబు! నాటి హరియాణాలో అమ్మాయిలంటే అంత చిన్నచూపు ఉండేది. అస్సలు ఆడపిల్లలు పుట్టనే కూడదని భావించేవారు. పుట్టినా వాళ్ళు వంటింటికే పరిమితం కావాలంటూ ఖాప్‌ పంచాయతీలూ హుకుం జారీ చేస్తుండేవి. ఆ నేపథ్యంలోనే సంజీవ్‌కి ఓ ఉపాయం తోచింది. తన కూతురి రెండు జడలూ కత్తిరించి.. అబ్బాయిలా క్రాపు చేయించాడు. కొడుకు 'సాహిల్‌' పేరు తనకుపెట్టి.. ఓ క్లబ్‌లో చేర్చాడు. అలా రెండేళ్ళపాటు మారువేషంతోనే శిక్షణ తీసుకుంది షెఫాలీ! చిన్నపాపే కాబట్టి ఎవరికీ అనుమానం రాలేదు. సంజీవ్‌ ఓసారి అంతకన్నా పెద్ద రిస్కే తీసుకున్నాడు..

షెఫాలీ వర్మ

'మ్యాన్‌' ఆఫ్‌ ద సిరీస్‌
షెఫాలీ వాళ్ళన్న సాహిల్‌ పక్క ఊళ్ళో ఓ టోర్నమెంట్‌లో ఆడటానికి రిజిస్టర్‌ చేసుకున్నాడు కానీ.. మ్యాచ్‌ ఆడాల్సిన రోజు జ్వరంతో పడుకున్నాడు. దాన్నో అవకాశంగా మలచుకున్న సంజీవ్‌.. కూతురినే ఆ అబ్బాయిలా టోర్నీకి పంపించాడు. సాహిల్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌కి తప్ప.. ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. ఆ టోర్నీలో షెఫాలీ బ్యాట్‌ని ఝళిపించేసింది. ఒక అమ్మాయి అయి ఉండి 'మ్యాన్‌' ఆఫ్‌ ద సిరీస్‌ ట్రోఫీ అందుకుంది. ఈలోపు షెఫాలీ చదువుతున్న బాలికల బడిలో క్రికెట్‌ శిక్షణ మొదలు కావడంతో.. షెఫాలీ మారువేషం వేయాల్సిన అవసరం తప్పింది. కానీ ఇరుగుపొరుగువారు 'ఆడపిల్లలకి ఈ కోచింగ్‌లేమిటో' అంటూ ఆ కుటుంబాన్ని దాదాపు బహిష్కరించినంత పనిచేశారు.

మరోవైపు- స్కూల్‌లో అందించే కోచింగ్‌ సరిపోవడం లేదని షెఫాలీని హరియాణాలోని అత్యాధునిక శ్రీ రామనారాయణ్‌ క్రికెట్‌ క్లబ్‌లో చేర్చాడు సంజీవ్‌. డబ్బులు ఎక్కువైనా అప్పులు చేసి మరీ శిక్షణ ఇప్పించాడు. 'ఇందుకోసం నాన్న తన బైకునీ అమ్మేశాడు. దాంతో నేను రోజూ 15 కిలోమీటర్లు సైకిల్‌ మీద బడికి వెళ్ళి వస్తుండేదాన్ని. బడి నుంచి మళ్ళీ కోచింగ్‌ సెంటర్‌కి 15 కిలోమీటర్లు. అక్కడ ఆటతో అలసిపోయి మళ్లీ పది కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుకుంటూ ఇంటికి రావాలి. రోజూ ఇలా 40 కిలోమీటర్లు సైకిల్‌ మీద తిరుగుతుంటే.. ఇంత కష్టం ఎందుకు నాకు అనిపించేది ఒక్కోసారి. కానీ భారత జట్టుకి ఎంపిక కావాలంటే ఈ కష్టం తప్పదు అని నాకు నేను నచ్చచెప్పుకునేదాన్ని' అంటుంది షెఫాలీ. ఆ కష్టమంతా ఊరికే పోలేదు.. శిక్షణ ప్రారంభంలోనే తన ప్రత్యేకత ఏమిటో గుర్తించాడు.. రామనారాయణ్‌ క్రికెట్‌ క్లబ్‌ కోచ్‌ అశ్వనీ కుమార్‌. తన కోసం కొత్త శిక్షణా పద్ధతిని రూపొందించాడు.

షెఫాలీ వర్మ

రంజీ ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కొని..
'పన్నెండేళ్ళ వయసులో- అమ్మాయైనా అబ్బాయైనా బంతిని బౌండరీ దాటించడం అంత సులభం కాదు. కానీ షెఫాలీ ఆ పని చాలా సులభంగా చేసేది. గొప్ప ఆత్మవిశ్వాసం ఉంటే కానీ అది సాధ్యం కాదు!' - షెఫాలీపైన అశ్వనీ కుమార్‌కి ఏర్పడ్డ తొలి అభిప్రాయం ఇదేనట. ఆ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికే తనకి రంజీట్రోఫీ ఫాస్ట్‌బౌలర్లతోనే ఓవర్లు వేయించేవాడు. అమ్మాయిల క్రికెట్‌లో 110 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరితే.. ఈ అబ్బాయిలు 140 కిలోమీటర్ల వేగంతో వేసేవాళ్ళట. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ కోచింగ్‌తో ఆ కుటుంబం ఆర్థికపరిస్థితీ దిగజారిపోతుండేది. 'నాకు సరైన క్రికెట్‌ కిట్‌ ఉండేది కాదు. ఓసారి గ్లవ్స్‌ చిరిగిపోయాయి. నాన్నకు చెబితే మళ్ళీ అప్పుచేస్తాడని చెప్పలేదు. ఫాస్ట్‌ బాల్స్‌ని ఎదుర్కొనేటప్పుడు చేతులు తీవ్రంగా నొప్పిపెడుతుండేవి. అయినా నా విజయాలకి ఈ బాధలే పునాదవుతాయని నమ్మేదాన్ని..' అంటుంది షెఫాలీ. ఆ నమ్మకం వమ్ముకాలేదు..

సచిన్‌ రికార్డు బద్దలు..
పదమూడేళ్ళప్పుడు హరియాణా తరపున అండర్‌-19 జట్టుకి ఆడింది షెఫాలీ. 20 బంతులకి 44 పరుగులు తీసి నాగాలాండ్‌పైన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత తనని ఐపీఎల్‌ తరహాలో భారత మహిళల కోసం ఏర్పాటు చేసిన లీగ్‌ టోర్నీలో 'వెలాసిటీ' జట్టులోకి తీసుకున్నారు. అందులో ఆమె బ్యాటింగ్‌ విన్యాసం చూసి సహచరురాలైన ఇంగ్లండ్‌ బ్యాటర్‌ 'భారత్‌కి తర్వాతి బ్యాటింగ్‌ సూపర్‌స్టార్‌ వచ్చేసింది' అంటూ ప్రశంసల్లో ముంచెత్తింది. తర్వాత భారత జట్టులో అరంగేట్రానికి ఎంతో కాలం ఎదురు చూడాల్సిన పని లేకపోయింది. 2019 అక్టోబర్‌లో టీ20 జట్టుకు ఎంపికైంది. కాకపోతే, దక్షిణాఫ్రికాపైన తన తొలి మ్యాచ్‌లో డకౌటై వెనుదిరిగింది. 'ఆ రోజు బాధపడుతున్న నాకు.. మా కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌ నా సమస్యేమిటో చెప్పాడు. విదేశీ పిచ్‌పైన బంతి బ్యాట్‌ నుంచి జారిపోతున్నందువల్ల దాన్ని ఎదుర్కోలేకపోయానని వివరించాడు.

దాంతో- అలా జారే సింథటిక్‌ బాల్‌తో సాధన చేయడం మొదలుపెట్టాను. నెల తిరక్కుండానే దానిపైన పట్టు చిక్కింది' అంటుంది షెఫాలీ. ఆ పట్టు ఎలాంటిదో ఆ తర్వాతి మ్యాచుల్లోనే కనిపించింది. వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో- 49 బంతుల్లో 73 పరుగులు సాధించింది. అప్పటికి షెఫాలీ వయసు 15 ఏళ్లే. అతి పిన్న వయసులో అంతర్జాతీయ అర్ధశతకం సాధించిన సచిన్‌ రికార్డును ఆమె తిరగరాసింది. అదే సిరీస్‌లో 158 పరుగులతో 'ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌' పురస్కారాన్నీ దక్కించుకుంది. చూస్తుండగానే షెఫాలీ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ బ్యాటర్‌గానూ ఎదిగింది. ఓపెనర్‌గా జట్టులో సుస్థిర స్థానం సంపాదించింది. బీసీసీఐ నుంచి షెఫాలీకి రూ.30 లక్షలతో గ్రేడ్‌-బి కాంట్రాక్టు రావడంతో కుటుంబ ఆర్థిక కష్టాలన్నీ తీరాయి. పెప్సీ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికచేయడంతో తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. కానీ..

అపజయాలు పలకరించాయి..
2020 టీ20 వరల్డ్‌కప్‌లో లీగ్‌ దశ, సెమీఫైనల్‌లో సత్తా చాటిన షెఫాలీ.. ఫైనల్‌లో ఓ కీలక క్యాచ్‌ వదిలేయడం, ఛేదనలో రెండు పరుగులకే వెనుదిరగడం, జట్టు ఓడిపోయాక బోరున ఏడవడాన్ని మీడియా పెద్దగా చూపడం వంటివి షెఫాలీని ఇబ్బందిపెట్టాయి. కానీ అదీ ఓ రకంగా మంచే చేసింది. ఫీల్డింగ్‌తోపాటూ క్రీజులో బౌన్సర్లని ఎదుర్కోలేకపోవడం తన ప్రధాన లోపాలుగా షెఫాలీ గ్రహించింది. రోజూ ఒకే స్ట్రెచ్‌లో వరసగా 150 బౌన్సర్లని ఎదుర్కొనేలా కఠోరసాధన చేయసాగింది.

కానీ ఆమె పట్టుదలని పరీక్షిస్తున్నట్టు కరోనా లాక్‌డౌన్‌తో ఆమె సాధన చేస్తూ వచ్చిన రామనారాయణ్‌ క్రికెట్‌ క్లబ్‌ని మూసివేశారు. 'అప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు. నేను వెనకపడిపోతానని భయమేసింది. దాంతో నా కోచ్‌ అశ్వనీకుమార్‌ని ఒప్పించి.. బౌలింగ్‌ మెషీన్‌ని ఆయన ఇంటి పెరట్లోనే పెట్టి సాధన చేశాను..' అంటుంది షెఫాలీ. ఆ కఠోర సాధనకి ఫలితం 2021 నుంచే కనిపించసాగింది. అంతర్జాతీయ పిచ్‌ల మీదా చక్కటి ప్రదర్శన కారణంగా అనూహ్యంగా అండర్‌-19 విభాగంలో జరిగే తొ ప్రపంచకప్‌ జట్టుకి షెఫాలీని కెప్టెన్‌గా ఎంపిక చేశారు!

కెప్టెన్‌గా జట్టుని ఉత్సాహంతో నడిపిస్తూనే.. టోర్నీలో నిలకడగా రాణించింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఐదు ఫోర్లూ, ఓ సిక్సూ బాది తన గురించి ప్రధాని మోదీ సైతం ప్రస్తావించేలా చేసింది! అదే ఊపుతో ఫైనల్‌లో ఇంగ్లండుని చిత్తుచేసి జట్టుని జగజ్జేతగా నిలిపింది. భారత మహిళా జట్టు సుదీర్ఘ నిరీక్షణకి తెరదించుతూ.. తొలి ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ని సాధించిపెట్టింది! తాను అక్కడితో ఆగిపోనంటోంది షెఫాలీ. టీ20 ప్రపంచకప్‌లోనూ రాణించి భారత్‌ను గెలిపిస్తానంటోంది.

ABOUT THE AUTHOR

...view details