భారత ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ట్విటర్ పోస్టుకు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన జయదేవ్ ఆటగాళ్ల సంతకంతో ఉన్న రెండు జెర్సీలను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఒకటి 2010లో వేసుకున్నది, రెండోది డిసెంబరు 2022లో ధరించింది. 2010 జెర్సీపై కెప్టెన్ ఎంఎస్ ధోనీ, వీరేందర్ సెహ్వాగ్, సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజ ఆటగాళ్ల సంతకాలు ఉన్నాయి. ఆ సమయంలో గ్యారీ కిర్‌స్టన్ కోచ్‌గా వ్యవహరించారు. తాజా జెర్సీపై కేఎల్ రాహుల్ సారథ్యంలోని జట్టు సంతకాలు చేసింది.
12 ఏళ్ల నిరీక్షణకు సాక్ష్యాలు.. జెర్సీలపై సంతకాలు చూసి మురిసిపోయిన ఉనద్కత్ - లేటెస్ట్ క్రికెట్ న్యూస్
దాదాపు పన్నెండేళ్ల తర్వాత రెండో టెస్టు మ్యాచ్ ఆడిన జయ్‌దేవ్ ఉనద్కత్ ఆనందం వర్ణించలేనిది. ఆ మ్యాచ్, ఈ మ్యాచ్‌కు సంబంధించి రెండు జెర్సీలను అపూరంగా చూసుకుంటూ మురిసిపోయాడు.
తన కెరీర్‌లో రెండో టెస్టు మ్యాచ్ ఆడటం కోసం ఉనద్కత్ 12 ఏళ్ల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన ఉనద్కత్ టెస్టుల్లోకి 2010లో అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. భారత్ తరఫున వికెట్ తీయాలని ఎంతగానో కలలు కనేవాడనని ఉనద్కత్ గతంలో వెల్లడించాడు. గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా టెస్టు సిరీస్‌కు దూరమవడం వల్ల ఉనద్కత్ చోటు దక్కించుకున్నాడు.
"మొదటి టెస్టు, రెండో టెస్టు మధ్య ఉన్న 12 ఏళ్ల కాలంలో కనీసం వెయ్యి సార్లైనా నేను దీని గురించి ఆలోచించి ఉంటాను. మొదటి టెస్టులో నేను ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాను. మళ్లీ భారత జట్టు తరఫున ఆడే అవకాశం వచ్చినప్పుడు ప్రజలు నా గురించి మాట్లాడిన ప్రతిసారీ ఇదే చర్చిస్తున్నారు" అని ఉనద్కత్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.