India Vs West Indies Tour 2023 : వరుసగా రెండోసారి ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్లో ఓటమిపాలైన భారత క్రికెట్ జట్టు.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. అందులో భాగంగా టీమ్ఇండియా.. ఆతిథ్య జట్టు విండీస్‌తో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
ఇటీవలే విండీస్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ.. వచ్చే వారంలో భారత జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను తిరిగి మళ్లీ టెస్టులకు పిలుపునివ్వాలని భారత సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా వెన్ను గాయం కారణంగా 2018 తర్వాత ఇప్పటి వరకు హార్దిక్ పాండ్య ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు.
"టెస్టులకు హార్దిక్ మాకు కచ్చితంగా మంచి ఎంపిక. కానీ తను ఫిట్‌గా ఉన్నానని, తిరిగి టెస్టుల్లో రీఎంట్రీ ఇస్తానని పాండ్యనే స్వయంగా ముందుకు రావల్సి ఉంటుంది. సెలక్టర్లు మాత్రం అతడిని రెడ్‌బాల్ క్రికెట్‌కు ఎంపిక చేయాలని ఆసక్తిగా ఉన్నారు. కానీ తుది నిర్ణయం మాత్రం పాండ్యనే తీసుకోవాల్సి ఉంటుంది. హార్దిక్ ఫిట్‌నెస్ టెస్టు క్రికెట్‌కు సరిపోతుందో లేదో తనకే తెలియాలి" అని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
విండీస్ పర్యటన వివరాలు..
- తొలి టెస్ట్- జులై 12-16, విండ్సర్ పార్క్, డొమినికా
- రెండో టెస్ట్- జులై 20-24, క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్
- జులై 27- తొలి వన్డే, కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
- జులై 29- రెండో వన్డే, కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
- ఆగస్ట్ 1- మూడో వన్డే, బ్రెయిన్ లారా క్రికెట్ అకాడమీ, ట్రినిడాడ్
- ఆగస్ట్ 3- తొలి టీ20, బ్రెయిన్ లారా క్రికెట్ అకాడమీ, ట్రినిడాడ్
- ఆగస్ట్ 6- రెండో టీ20, నేషనల్ స్డేడియం, గయానా
- ఆగస్ట్ 8- మూడో టీ20, నేషనల్ స్డేడియం, గయానా
- ఆగస్ట్ 12- నాలుగో టీ20, బ్రౌవార్డ్ కౌంటీ స్డేడియం, ఫ్లోరిడా
- ఆగస్ట్ 13- ఐదో టీ20, బ్రౌవార్డ్ కౌంటీ స్డేడియం, ఫ్లోరిడా
జియో సినిమాలో ఫ్రీగా భారత్- విండీస్ సిరీస్
Jiocinema India Vs West Indies : అయితే భారత్-వెస్టిండీస్ సిరీస్‌ను జియో సినిమాలో ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటించింది. జులై 12- ఆగస్ట్ 13 వరకు జరిగే ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు ఇది వర్తిస్తుందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అధినేత ఆకాశ్ అంబానీ వెల్లడించారు.