తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రేయస్ సూపర్ శతకం.. రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై టీమ్ఇండియా విక్టరీ

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. శ్రేయస్ అయ్యర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

INDIA VS SA 2ND ODI RESULT
INDIA VS SA 2ND ODI RESULT

By

Published : Oct 9, 2022, 9:03 PM IST

Updated : Oct 9, 2022, 9:26 PM IST

సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్​లో భారత్ గొప్పగా పుంజుకుంది. తొలి వన్డేలో త్రుటిలో ఓటమిపాలైన ధావన్​సేన.. రెండో మ్యాచ్​లో సఫారీలు నిర్దేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 45.5 ఓవర్లలోనే ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ చక్కని శతకంతో చెలరేగిన వేళ.. టీమ్ఇండియా సునాయాసంగా విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమం అయింది. భారత బ్యాటింగ్‌లో శ్రేయస్‌(113*)తో పాటు ఇషాన్‌ కిషన్‌ (93) రాణించాడు. త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. శుభ్‌మన్‌(28), సంజు శాంసన్‌(30*) ఫర్వాలేదనిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో వ్యాన్‌ పార్నెల్, కగిసో రబాడ, ఫొర్టైన్‌ తలో వికెట్‌ తీశారు.

శ్రేయస్ అయ్యర్

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. ఆచితూచిగా ఆడింది. మ్యాచ్​లో మెరుగ్గా బౌలింగ్ చేసిన భారత బౌలర్ మహ్మద్ సిరాజ్.. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో వికెట్ తీసి శుభారంభం చేశాడు. కెరీర్​లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన షాబాజ్ అహ్మద్.. పదో ఓవర్​లో మరో ఓపెనర్ మలన్​ను(25) వెనక్కి పంపించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన మార్​క్రమ్(79), వన్​డౌన్ బ్యాటర్ హెండ్రిక్స్(74) సమయోచితంగా ఇన్నింగ్స్​ను నడిపించారు. అడపాదడపా బౌండరీలు కొడుతూ.. స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని సిరాజ్ విడగొట్టాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో క్లాసెన్(30), మిల్లర్(35*) ఫర్వాలేదనిపించారు. చివర్లో భారత బౌలర్లు మెరుగ్గా బంతులు వేసి.. స్కోరు భారీగా పెరగకుండా చూశారు. మొత్తంగా ఏడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 278 పరుగులు చేసింది.

శ్రేయస్ అయ్యర్

ఛేదనలో భారత్​కు శుభారంభమేమీ దక్కలేదు. సారథి శిఖర్ ధావన్ 20 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఉన్నంతసేపు ధాటిగా ఆడిన శుభ్​మన్ గిల్(28) సైతం.. త్వరగానే ఔట్ అయిపోయాడు. ఈ దశలో యువ బ్యాటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ భారత ఇన్నింగ్స్​ను నిలబెట్టారు. ఇషాన్ దూకుడుగా ఆడగా.. శ్రేయస్ కాస్త సంయమనం పాటించాడు. సఫారీ బౌలర్లకు అవకాశమే ఇవ్వకుండా చక్కటి బ్యాటింగ్​తో వీరిద్దరూ అలరించారు. ఈ క్రమంలో మూడో వికెట్​కు 160 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 93 పరుగుల వద్ద ఉండగా ఇషాన్.. ఓ భారీ షాట్​కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే, అప్పటికే భారత్ పటిష్ఠ స్థితికి చేరింది. దీంతో శ్రేయస్ అయ్యర్.. సాధికారతతో బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలోనే వన్డేలో రెండో శతకాన్ని నమోదు చేశాడు. చివర్లో శాంసన్(30) ఆకట్టుకున్నాడు. దీంతో 25 బంతులు ఉండగానే భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. సిరీస్ సమం కాగా.. మూడో వన్డే అక్టోబర్ 11న దిల్లీలో జరగనుంది.

.
Last Updated : Oct 9, 2022, 9:26 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details