న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది రోహిత్ సేన. రాంచీ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో కివీస్‌పై 7 వికెట్లతో విజయం సాధించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (65), రోహిత్ శర్మ (55) దంచికొట్టారు. దీంతో నిర్దేశిత 154 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమ్ఇండియా. కివీస్ బౌలర్లలో సౌథీ 3 వికెట్లు తీశాడు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (31), డారిల్ మిచెల్ (31) శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అయితే గప్తిల్ ఔటైన తర్వాత కివీస్ పరుగుల వేగం మందగించింది. అడపాదడపా బౌండరీలు ఇచ్చినా.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మిడిలార్డర్ బ్యాటర్లు మార్క్ చాప్‌మన్ (21), గ్లెన్ ఫిలిప్స్ (34) దూకుడుగా ఆడటం వల్ల న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరును చేయగలిగింది. మిగిలిన బ్యాటర్లలో సీఫర్ట్ 13, నీషమ్ 3, సాట్నర్ 8*, మిల్నే 5* పరుగులు చేశారు.