బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్‌కు రంగం సిద్ధమైంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను వరుసగా రెండు టెస్టుల్లోనూ చిత్తు చేసిన భారత్.. సిరీస్ విజయమే లక్ష్యంగా మూడో టెస్టులో బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సిరీస్‌లో మరో మ్యాచ్ ఉన్నప్పటికీ.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు విషయంలో ఉత్కంఠకు అవకాశం లేకుండా ఇందౌర్‌లోనే గెలిచి సిరీస్ విజయంతో పాటు ఆ బెర్తునూ సొంతం చేసుకోవాలని రోహిత్ సేన చూస్తోంది.
- భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అశ్విన్, అక్షర్, ఉమేశ్, సిరాజ్.
- ఆస్ట్రేలియా తుది జట్టు:ట్రావిస్‌హెడ్, ఉస్మాన్ ఖవాజా, లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), హాండ్స్‌కాంబ్, గ్రీన్, కేరీ, స్టార్క్, మర్ఫీ, లైయన్, కునెమన్.
పిచ్.. కొంచెం తేడా
మూడో టెస్టుకు ఆతిథ్యమివ్వనున్న హోల్కర్ స్టేడియం కూడా స్పిన్‌కే అనుకూలం. కానీ తొలి రెండు టెస్టులతో పోలిస్తే ఇక్కడ కొంచెం పేసర్లకు అవకాశముంటుంది. ఇక్కడ జరిగిన గత రెండు టెస్టుల్లో తొలి రెండు రోజులు పేసర్లు ప్రభావం చూపారు. స్పిన్నర్లు రెండో రోజు నుంచి ఆధిపత్యం చలాయించవచ్చు. మ్యాచ్ ముందు రోజు పిచ్‌పై కొంచెం పచ్చిక కనిపించింది. బుధవారం కూడా పిచ్ అలాగే ఉంటే పేసర్లకు అవకాశం ఉన్నట్లే.