India Vs Australia 3rd ODI 2023 :రాజ్‌కోట్ వేదికగా జరిగిన భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డేలో ఆసీస్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 49.4 ఓవర్లలో 286 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (81), విరాట్ కోహ్లీ (56), శ్రేయస్ అయ్యర్ (48) మినహా మిగతావారెవరూ పెద్దగా రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 4, జోష్ హజెల్‌వుడ్ 2, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, తన్వీర్ సంఘ, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. అయితే, మొదటి రెండు వన్డేల్లో గెలిచిన టీమ్‌ఇండియా మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కింది.
భారత్ ఇన్నింగ్స్!
కెప్టెన్ రోహిత్ శర్మ 81 పరుగులతో చెలరేగగా.. కింగ్ విరాట్ కోహ్లీ (56) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 2వ వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ (48) రాణించాడు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 30 బంతుల్లో 26 పరుగులు చేసి నిరాశపర్చాడు. మరో ఆటగాడు రవీంద్ర జడేజా 36 బంతుల్లో 35 రన్స్ మాత్రమే చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 8 పరుగులకే పెవిలియన్ చేరాడు.
ఆసీస్ బ్యాటింగ్!
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకొన్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (96 పరుగులు : 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేసి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. డేవిడ్ వార్నర్ (56 పరుగులు : 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) స్టీవ్ స్మిత్ (74), లబుషేన్ (72), రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్‌దీప్ 2, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు.