బోర్డర్-గావస్కర్ సిరీస్ రెండో టెస్టులో ఘన విజయం అనంతరం సిడ్నీ వేదికగా గురువారం నుంచి జరగనున్న మూడో టెస్టుకు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. ఈ టెస్టులోనూ.. గెలిచి సిరీస్‌లో ముందడుగు వేయాలని రహానె సేన పట్టుదలగా ఉంది. కండరాల గాయంతో సిరీస్ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన పేసర్ ఉమేష్ యాదవ్ స్థానంలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనే అంశంపై టీమ్ మేనేజ్‌మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీలలో.. ఎవరిని జట్టులోకి తీసుకోవాలనే విషయంపై మాజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సిడ్నీలో పరిస్థితులు మబ్బు పట్టి ఉండి పిచ్‌పై తేమ ఉంటే శార్దూల్ ఠాకూర్‌కు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. పిచ్ ప్లాట్‌గా ఉంటే మంచి వేగంతో బంతులు వేయగల సైనీ వైపు జట్టు మొగ్గు చూపే అవకాశం ఉంది. బంతిని రివర్స్ స్వింగ్ చేయగల సామర్థ్యం సైనీకి ఉంది. రెండేళ్ల క్రితం తొలి టెస్టు ఆడిన శార్దూల్ ఠాకూర్... ఆ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే గాయపడి మైదానాన్ని వీడాడు. ఠాకూర్‌కు తుదిజట్టులో చోటు దక్కితే అతడికి అనధికారికంగా ఇదే తొలి టెస్టు కానుంది.
సిడ్నీలో ఒకే విజయం..
రోహిత్‌శర్మ చేరికతో టీమ్ఇండియా బ్యాటింగ్ విభాగం బలపడింది. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ స్థానంలో రోహిత్‌శర్మ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. పేస్‌ను స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే రోహిత్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కానీ సిడ్నీ మైదానంలో రికార్డు భారత్‌ను కలవరపెడుతోంది. ఇందులో 12 టెస్టుల్లో భారత్ ఒక్క విజయం మాత్రమే సాధించింది.