కాన్బెర్రాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 302 పరుగులు సాధించింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య(92*), సారథి కోహ్లీ(63), జడేజా(66) అర్ధశతకాలతో మెరిశారు. మిగతా బ్యాట్స్‌మన్ నామమాత్రపు పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో అగర్ 2, జంపా, హెజిల్వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ తీశారు.
సచిన్ రికార్డు బద్దలు
ఈ పోరులో టీమ్ఇండియా సారథి కోహ్లీ(63).. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ రికార్డును బద్దలకొట్టాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12వేల పరుగులు(242 ఇన్నింగ్స్‌ల్లో) పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ తర్వాత సచిన్ (300 ఇన్నింగ్స్‌లు), పాంటింగ్(314), కుమార సంగక్కర(336), సనత్ జయసూర్య(379), మహేల జయవర్ధనే(399) ఉన్నారు.