ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు వేళైంది. మరో వారం రోజుల్లో అడిలైడ్ వేదికగా టీమ్‌ఇండియా తొలిటెస్టు ఆడనుంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల సిరీసులకు దూరమయ్యాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కైనా పూర్తిగా అందుబాటులో ఉంటాడనుకుంటే అదీ లేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమయ్యాడు. దాంతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. శుక్రవారమే అతడికి రెండో ఫిట్‌నెస్ పరీక్ష. దాంతో అందరి చూపూ రోహిత్ పైనే ఉంది.
గాయం కారణంగా...
ఐపీఎల్‌లో ఆడుతున్నప్పుడే రోహిత్ తొడ కండరాల గాయంతో కొన్ని మ్యాచులు ఆడలేదు. ఇబ్బందేమీ లేకపోవడంతో ఆ తర్వాత నాకౌట్ మ్యాచులన్నీ ఆడాడు. అయితే ఫిట్‌నెస్ సమస్యలు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు బీసీసీఐ అతడిని ఆసీస్ పర్యటనకు ఎంపిక చేయలేదు. దాంతో వివాదం చెలరేగింది. ఆ తర్వాత అతడిని పరీక్షించిన బీసీసీఐ వైద్యబృందం కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని సూచించడంతో పరిమిత ఓవర్ల సిరీసులకు ఎంపిక చేయలేదు.
టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్పటికీ రోహిత్ టీమ్‌ఇండియాతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. తన తండ్రికి ఆరోగ్య సమస్యలు ఉండటంతో భారత్‌కు తిరిగి వచ్చాడు. ఎన్‌సీఏలో సాధన చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం పెట్టిన ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమవ్వడంతో తొలి రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. తాజాగా శుక్రవారం అతడు రెండోసారి ఫిట్‌నెస్ పరీక్ష ఎదుర్కోనున్నాడు. ఇందులో గనక సఫలీకృతుడైతే శనివారం అతడు ఆస్ట్రేలియా బయల్దేరుతాడు. అక్కడ 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్నాక జట్టుతో కలుస్తాడు. టెస్టు మోడ్‌లోకి రావాలంటే అతడు విపరీతంగా నెట్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆపై సిడ్నీలో జనవరి 7న మొదలయ్యే మూడో టెస్టు ఆడతాడు. ఒకవేళ గనక అతడు విఫలమైతే టీమ్‌ఇండియాకు కోహ్లీతో పాటు రోహిత్ సేవలూ అందవు.
ఇదీ చదవండి:భూమ్మీద బిజీ క్రికెటర్.. 'కోహ్లీనే'!