India South Africa T20 Series : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్ గెలుచుకుంది. అయితే సూర్యకుమార్ యాదవ్ అసాధారణంగా ఆడడం.. కోహ్లి సమయోచితంగా రాణించడం.. హార్దిక్ పాండ్య కూడా చివర్లో మెరుపులు మెరిపించడంతో టీమ్‌ఇండియా గట్టెక్కేసింది. లేదంటే సిరీస్ కోల్పోవాల్సి వచ్చేది. ఈ మ్యాచ్‌లో 14 ఓవర్లకు 117/6తో ఉన్న ఆసీస్.. భారత్ ముందు 187 పరుగుల లక్ష్యాన్ని నిలపడం అనూహ్యం.
అంతకుముందు వర్ష ప్రభావంతో 8 ఓవర్లకు కుదించిన రెండో టీ20లో.. 5 ఓవర్లకు 46/4కు పరిమితమైన కంగారూలు 91 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తారని కూడా ఎవరూ అనుకోలేదు. ఇక తొలి టీ20లో 208 పరుగులు స్కోరు చేసి విజయంపై ధీమాగా ఉన్న జట్టు.. చివరికి ఓటమి వైపు నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ డెత్ ఓవర్లలో బౌలర్లు చేతులెత్తేడం, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం కళ్లెం వేయకపోవడంతో భారత్‌కు ఇబ్బందులు తప్పలేదు.
ఈ సిరీస్ అనే కాదు.. కొంత కాలంగా చాలా మ్యాచ్‌ల్లో డెత్ ఓవర్ల బౌలింగ్‌లో భారత్ తేలిపోతూ వస్తోంది. ఆసియా కప్‌లో ఫైనల్ చేరకుండానే నిష్క్రమించడానికి.. పాకిస్థాన్, శ్రీలంక జట్ల చేతుల్లో పరాజయం పాలవడానికి చివరి ఓవర్లలో పేలవ బౌలింగే కారణం. సూపర్-4 దశలో ఈ రెండు జట్లపై పెద్ద స్కోర్లే చేసినా.. ఆ తర్వాత మధ్య ఓవర్లలో పైచేయి సాధించినా.. ఆఖర్లో పట్టు విడవడంతో ఓటములు తప్పలేదు. అవమాన భారంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
వాళ్లొస్తే మారుతుందనుకుంటే..
ఒకప్పుడు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆఖరి ఓవర్లలో బంతి అందుకుంటే ఒక భరోసా ఉండేది. వికెట్ టు వికెట్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌కు అతను కళ్లెం వేసేవాడు. షాట్లు ఆడేందుకు అవకాశమే ఇచ్చేవాడు కాదు. కానీ ఇప్పుడు అతడి బౌలింగ్‌ను బ్యాట్స్‌మెన్ అలవోకగా ఆడేస్తున్నారు. అతను పూర్తిగా లయ తప్పుతున్నాడు. భువి బౌలింగ్ అంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు పండగే అన్నట్లు తయారైంది పరిస్థితి. ఆసియా కప్‌లో పాకిస్థాన్, శ్రీలంకలతో మ్యాచ్‌ల్లో భువిని నమ్మి 19వ ఓవర్ ఇస్తే.. భారీగా పరుగులివ్వడం ద్వారా 50-50గా ఉన్న మ్యాచ్‌లను ప్రత్యర్థి జట్ల వైపు మళ్లించాడతను.
ఆసీస్‌తో తొలి టీ20లోనూ అదే జరిగింది. చివరి టీ20లో కూడా భువి దారాళంగా పరుగులిచ్చేశాడు. యువ పేసర్ అవేష్ ఖాన్ పరుగులు కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమవుతుండడంతో అతడికి ప్రపంచకప్ జట్టులో చోటివ్వలేదు. ఇక గాయాల వల్ల ఆసియా కప్‌కు దూరంగా ఉండి ఆస్ట్రేలియాతో సిరీస్‌కు తిరిగి జట్టులో చోటు దక్కించుకున్న బుమ్రా, హర్షల్ పటేల్‌లపై జట్టు చాలా ఆశలు పెట్టుకుంది. వీరి పునరాగమనంతో బౌలింగ్ బలోపేతం అవుతుందని గావస్కర్ లాంటి వాళ్లు కూడా నమ్మారు.
కానీ కంగారూలతో సిరీస్‌లో వీళ్లిద్దరూ తేలిపోయారు. హర్షల్ పటేల్ 3 మ్యాచ్‌ల్లో కలిపి 8 ఓవర్లలో 99 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్టే పడగొట్టాడు. 2 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 6 ఓవర్లలో 72 పరుగులు ఇచ్చుకుని ఒక్క వికెట్టే తీశాడు. ఈ ఇద్దరూ చివరి ఓవర్లలో పరుగులు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.
ఇదే చివరి అవకాశం
బుమ్రా, హర్షల్ పటేల్ ఆస్ట్రేలియాపై విఫలమైనంత మాత్రాన వారిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. బుమ్రా స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్‌లో, భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ అతడికి గొప్ప రికార్డుంది. టీ20ల్లో అయితే అతడికి తిరుగులేదు. హర్షల్ కూడా ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శనతో జట్టులోకి వచ్చాడు. డెత్ ఓవర్లలో మహా మహా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి ప్రశంసలు అందుకున్నాడు.