Ind w vs Aus w 2nd T20:రెండో టీ20లో ఆస్ట్రేలియా మహిళలు 6 వికెట్ల తేడాతో నెగ్గారు. టీమ్ఇండియా నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని, ఆసీస్ 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి (133-4) ఛేదించింది. ఎల్లిస్ పెర్రీ (34* పరుగులు; 21 బంతుల్లో, 3x4, 2x6), ఫోబి లిచ్‌ఫీల్డ్ (18* పరుగులు; 12 బంతుల్లో, 3x4) రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2, శ్రేయంకా పాటిల్, పూజా వస్త్రకార్ తలో వికెట్ దక్కించుకున్నారు. టీమ్ఇండియా కీలక వికెట్లు దక్కించుకున్న ఆసీస్ బౌలర్ కిమ్ గార్త్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక ఇరుజట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జనవరి 9న జరగనుంది.
స్వల్ప లక్ష్య ఛేదనను ఆసీస్ ఘనంగా ఆరంభించింది. ఓపెనర్లు హేలీ (26 పరుగులు; 21 బంతుల్లో, 4x4), బెత్ మూనీ (20 పరుగులు; 2x4), వన్‌డౌన్‌లో వచ్చిన తహిళ మెక్‌గ్రాత్ (19 పరుగులు; 3x4) సమష్టిగా రాణించారు. టీమ్ఇండియా ఓ దశలో పుంజుకుంది. నిలకడగా ఆడుతున్న మెక్‌గ్రాత్‌ని శ్రేయంక పాటిల్ పెవిలియన్ చేర్చింది. తర్వాత క్రీజులోకి ఆష్లీన్ గార్డ్‌నర్ (7)ని పుజా వస్త్రాకర్ వెనక్కి పంపింది. దీంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠకు తెరతీసింది. కానీ, చివర్లో పెర్రీ, లిచ్‌ఫీల్డ్ టీమ్ఇండియా మరో ఛాన్స్ ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించేశారు.