IND vs WI First ODI 2022: భారత్-విండీస్ తొలివన్డేలో స్పిన్నర్ చాహల్ విజృంభించాడు. తన స్పిన్ మాయాజాలంతో విండీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కరి చేశాడు. హోల్డర్ మినహా ఓపెనర్ల నుంచి టెయిలెండర్ల వరకు ఎవరూ చాహల్ ధాటికి నిలువలేకపోయారు. అయితే చాహల్ తీసిన 4 వికెట్లలో కీలకమైనది, క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నది విండీస్ కెప్టెన్ పొలార్డ్‌ను ఔట్ చేయడం. ప్రమాదకర బ్యాటర్ అయిన పొలార్డ్‌ను తొలి బంతికే చాహల్ పెవిలియన్ పంపించిన తీరుకు అందరూ ఆశ్చర్యపోయారు. అయితే దీని వెనుక టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్లాన్ ఉందని తెలుస్తోంది.
ఉల్టా వాలా డాల్..
అప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న విండీస్‌ను తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆదుకుని స్కోరు బోర్డును పరగులు పెట్టించాలనే లక్ష్యంతో పొలార్డ్ క్రీజులోకి అడుగుపెట్టాడు. అప్పటికే రెండు వికెట్లు తీసి మంచి ఫామ్‌లో చాహల్‌కు కెప్టెన్ రోహిత్ బంతిని అందించాడు. పొలార్డ్ నిలిస్తే ప్రమాదమని గుర్తించి అతడిని ఎలా వెనక్కి పంపించాలో అప్పటికే ప్లాన్ వేసిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాహల్ వద్దకు వచ్చాడు. "ఉల్టా వాలా డాల్, బిందాస్ డాల్" (గూగ్లీ వేయి, ఏం కంగారు పడకు) అంటూ సూచన చేశాడు. కోహ్లీ సూచనను పాటిస్తూ చాహల్ గూగ్లీ వేశాడు.. అంతే ప్లాన్ సక్సెస్. షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పొలార్డ్ వికెట్లకు దొరికిపోయాడు.