Ind vs Wi 5th T20 : వెస్టిండీస్‌తో టీ-20 సిరీస్ చివరి మ్యాచ్‌లో టీమ్ఇండియా 8వికెట్ల తేడాతో ఓడిపోయింది. 166 పరుగుల టార్గెట్‌ను విండీస్ 18 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. బ్రెండన్ కింగ్ (85 పరుగులు : 55 బంతుల్లో, 5x4, 6x6), నికోలస్ పూరన్ (47 పరుగులు : 1x4, 4x6) తుపాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, తిలక్ వర్మ తలో వికెట్ తీశారు. దీంతో ఆతిథ్య జట్టు.. ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్‌పై విండీస్‌కు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం. ఇక భారత్ ఇన్నింగ్స్‌కు కళ్లెం వేసిన పేసర్ షెఫర్డ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', నికోలస్ పూరన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు దక్కాయి. ఈ మ్యాచ్‌తో భారత్ వెస్టిండీస్ పర్యటన ముగిసింది.
అంతకుముందు టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్లోనే విండీస్ బౌలర్ అకీల్.. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (5)ను వెనక్కిపంపాడు. జైశ్వాల్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అకీల్ చురుగ్గా అందుకున్నాడు. కాగా అదే అకీల్.. మూడో ఓవర్లో మరో ఓపెనర్ గిల్ (9)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో భారత్ 17 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది.
మరో వికెట్ పడకుండా కొద్దిసేపు సూర్యకుమార్ (61)తో, తిలక్ వర్మ (27) జతకట్టాడు. కానీ చేజ్ బౌలింగ్‌లో తిలక్ అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి.. పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన సంజూ శాంసన్ (13), కెప్టెన్ హార్దిక్ పాండ్య (14), అక్షర్ పటేల్ (13) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో నిర్ణిత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ 4, అకీల్ హోసీన్ 2, జేలన్ హోల్డర్ 2, రోస్టన్ చేజ్ ఒక వికెట్ పడగొట్టారు.