Ind vs WI 2nd Odi:వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత్ జట్టు సిరీస్‌పై కన్నేసింది. తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రోహిత్ సేన బుధవారం జరిగే రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రెండో వన్డే జరగనుంది.
దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన సారథి రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రావడం సహా తొలి వన్డేలో 60 పరుగులతో రాణించడం జట్టుకు బాగా కలిసివచ్చింది. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కొద్ది విరామం తర్వాత తిరిగి జట్టులోకి వస్తుండగా బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. రాహుల్ తుది జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్‌ను పెవిలియన్‌కు పరిమితం చేయడం లేదా మిడిలార్డర్‌లో దించే అవకాశాలున్నాయి. ఒకవేళ రోహిత్‌తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే రాహుల్ మిడిలార్డర్‌లో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వీరిద్దరికీ జట్టులో స్థానం లభిస్తే దీపక్ హుడా ఆడకపోవచ్చు.
- విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్‌లతో భారత బ్యాటింగ్ లైనప్ పటిష్ఠంగా కనిపిస్తోంది.
- తొలి మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా రాణించడం వల్ల రెండో వన్డేలో బౌలింగ్ విభాగంలో పెద్దగా మార్పులు చేయకపోవచ్చని తెలుస్తోంది. తొలి వన్డేలో స్పిన్నర్లు యజువేంద్ర చాహల్ 4, వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లతో సత్తాచాటారు. వీరిలో ఒకరిని తప్పిస్తే మాత్రం లెఫ్టామ్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కవచ్చు.
- ధావన్, శ్రేయస్ అయ్యర్‌కు కరోనా నెగెటివ్‌గా తేలగా.. ప్రాక్టీస్‌కు అవకాశం లభించింది. వీరు జట్టులోకి వచ్చే అవకాశాల్ని కొట్టిపారేయలేం.
మరోవైపు వెస్టిండీస్ జట్టును బ్యాటింగ్ వైఫల్యాలు వెంటాడుతున్నాయి. గత 16 వన్డేలలో 10 సార్లు ఆ జట్టు ఆలౌట్ అయ్యింది. జట్టు 50 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయలేకపోవడం సారథి పొలార్డ్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. బ్యాటర్లు మరింత మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పాల్సిన అవసరం ఉందని విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ చెబుతున్నాడు.
నికోలస్ పూరన్, పొలార్డ్ వంటి హార్డ్ హిట్టర్లు ఉన్నందున తొలి వన్డేలో చోటుచేసుకున్న లోపాలను అధిగమించి రెండో మ్యాచ్‌లో భారీ స్కోర్ చేయాలని కరీబియన్ జట్టు భావిస్తోంది.