న్యూ ఇయర్లోకి అడుగు పెట్టగానే ప్రతి ఒక్కరూ.. ఈ ఏడాది ఏం సాధించాలనే సంకల్పం సిద్ధం చేసుకొంటారు. అలాగే టీమ్ఇండియా కెప్టెన్ హార్దిక్ పాండ్య కూడా ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. తన సంకల్పమేంటో వివరించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా హార్దిక్ పాండ్య సారథ్యంలోని భారత్ మంగళవారం శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడనుంది. సిరీస్ ప్రారంభం సందర్భంగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అతడు.. రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ప్రపంచమంతా అతడి వెంటే ఉందని తెలిపాడు.
"తప్పకుండా గతేడాదిని తలుచుకోవాలి. గాయాలతో నిలకడగా జట్టులో ఉండలేకపోయా. అలాగే మేం టీ20 ప్రపంచకప్ 2022ను నెగ్గాలని తీవ్రంగా ప్రయత్నించాం. అయితే అది కుదరలేదు. అయినా ఫర్వాలేదు. ఎప్పుడూ ముందుకు వెళ్లాలనే ఆలోచిస్తూ ఉంటా. నేను ఇంకేం సాధించాలి..? అని అనుకొంటే మాత్రం ఇంకా చాలా ఉందనే చెప్తా. ఎందుకంటే నా కెరీర్‌లో పెద్దగా సాధించిందేమీ లేదు. అందుకే నా లక్ష్యం, ఈ ఏడాది సంకల్పం మాత్రం వన్డే ప్రపంచకప్‌ను భారత్‌కు అందించాలి. ఇంతకంటే పెద్ద సంకల్పం మరొకటి ఉండదేమో. ఆ దిశగా మేమంతా కృషి చేస్తాం" అని హార్దిక్ పేర్కొన్నాడు.