IND vs SL Asia Cup 2023 Final :2023 ఆసియా కప్ ఫైనల్ ఆదివారం కొలంబో వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక.. ఆసియా కప్ చరిత్రలో అత్యధికసార్లు (13) ఫైనల్‌కు చేరిన జట్టుగా రికార్డు కొట్టింది. లంక తర్వాత భారత్ 11 సార్లు ఫైనల్ చేరుకుంది. కానీ భారత్ ఖాతాలో 7 ఆసియా కప్ టైటిళ్లు ఉండగా.. లంక ఆరుసార్లు మాత్రమే ఛాంపియన్‌గా నిలిచింది.
ఆదివారం జరగబోయే తుదిపోరులో గెలిచి.. భారత్‌తో టైటిళ్ల రికార్డును సమం చేయాలని శ్రీలంక భావిస్తోంది. మరోవైపు బహుళ జట్ల టోర్నీల్లో గత ఐదేళ్లుగా ఒక్క టైటిల్ గెలవని భారత్.. ఈసారి ఛాంపియన్‌గా నిలవాలని తహతహలాడుతోంది. మరి టీమ్ఇండియాకు కీలకం కానున్న ప్లేయర్లెవరో చూసేద్దామా!
టాపార్డర్..ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్.. ఈ టోర్నీలో భారత్‌కు మంచి శుభారంభాలు ఇచ్చారు. చివరి మ్యాచ్ మినహా.. వరుసగా మూడుసార్లు రోహిత్ అర్ధ శతకాలు బాదడం, అటు గిల్ బంగ్లాతో మ్యాచ్‌లో శతకంతో టచ్‌లోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశాలు. ఇక స్టార్ బ్యాటర్ కోహ్లీ.. పాకిస్థాన్‌పై సూపర్ సెంచరీతో పాత విరాట్‌ను గుర్తు చేశాడు. గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న విరాట్ ఫైనల్లో చెలరేగితే లంక బౌలర్లకు కష్టాలు తప్పవు.
మిడిలార్డర్..చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చాడు కేఎల్ రాహుల్. ఈ టైమ్‌లో తన ఫామ్‌పై ఎన్నో సందేహాలున్న వేళ.. పాక్‌పై అద్భుత సెంచరీ నమోదు చేసి సత్తా చాటుకున్నాడు. మరోసారి అతడు బ్యాట్ ఝలిపిస్తే.. టీమ్ఇండియాకు భారీ స్కోర్ ఖాయం. ఇక మరో బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ టోర్నీలో నిలకడగానే రాణిస్తున్నాడు. ఇషాన్ కూడా మిడిలార్డర్లో మంచి పార్ట్నర్షిప్ ఇవ్వగలిగితే భారత్‌ను ఆపడం లంకకు అసాధ్యం.